రాజ్‌నాథ్‌కు ‘దేవరపల్లి’ ఘటనపై ఫిర్యాదు
న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా దేవరపల్లి గ్రామంలోని దళితుల భూముల్లో ప్రభుత్వం అక్రమాలపై ఆయన ఈ సందర్భంగా హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి ...ఎస్సీ కమిషన్ చైర్మన్ కఠారియాను కలిశారు.
దేవరపల్లిలోని దళితులు సాగు చేసుకుంటున్న భూములపై ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకు వచ్చారు. దళితుల భూములకు రక్షణ కల్పించి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని కఠారియాకు విజ్ఞప్తి చేశారు. దళితులు, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా భూములు లాక్కోవడం అన్యాయమని, వందల సంఖ్యలో పోలీసులను మోహరింపచేసి, దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే దళితుల భూములకు రక్షణ కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.
కాగా ప్రకాశం జిల్లాలో పర్చూరు మండలం దేవరపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా వివాదస్పద భూముల్లో చెరువు తవ్వుతుండటంతో దళితులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 400 మంది పోలీసుల సిబ్బంది పహారా మధ్య ప్రొక్లెయిన్లతో చెరువును తవ్వుతున్నారు. దీనిపై గ్రామస్తులు తీవ్ర నిరసన తెలిపారు.