
నేడు వైఎస్సార్‌సీపీ ప్లీనరీ
వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్లీనరీ సమావేశం గురువారం(నేడు) హైదరాబాద్‌లో జరగనుందని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్లీనరీ సమావేశం గురువారం(నేడు) హైదరాబాద్‌లో జరగనుందని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎల్‌బీనగర్ ప్రాంతంలోని చంపాపేట్ రోడ్డులోని ఎస్‌ఎన్ రెడ్డి గార్డెన్స్(సామ నరసింహా రెడ్డి గార్డెన్)లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరవుతారని తెలిపారు.
ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా మొత్తం 10 తీర్మానాలను ప్లీనరీ సమావేశంలో ప్రవేశపెట్టి చర్చించను న్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో అమలులో అధికార టీఆర్‌ఎస్ వైఫల్యాలు, సంక్షోభంలో వ్యవసాయ రంగం, నకిలీ విత్తనాల బెడద, రైతు ఆత్మహత్యలు, పంటలకు దక్కని గిట్టుబాటు ధరలు, నత్తనడకన ప్రాజెక్టుల నిర్మాణం, రీడిజైనింగ్, భూ సేకరణ అంశాలపై తీర్మానాలు, చర్చ ఉంటుందని పేర్కొన్నారు.
వీటితోపాటు అందని ద్రాక్షలా కార్పొరేట్ వైద్యం, ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులో జాప్యం, కలగానే మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, సంక్షో భంలో సంక్షేమం, కొరవడిన సామాజిక న్యాయం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు, ఇస్తామన్నది లక్షా ఉద్యోగాలు ఇచ్చింది 25 వేలే, ఉన్నత విద్యకు దూరంగా విశ్వ విద్యాలయాలు, ఫీజుల చెల్లింపులో జాప్యం, మహిళల భద్రత–సాధికారత, విశ్వ నగరమా, వింత నగరమా అనే అంశాలను తీర్మానాలుగా పెట్టి ఒక్కో అంశంపై గంట పాటు చర్చించి, రాబోయే రెండున్నర ఏళ్లకు ఆందోళన కార్యక్రమాలు రూపొందించ నున్నట్లు చెప్పారు.