
సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం సమర్పిస్తున్న జెడ్పీ చైర్మన్లు
• రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా పరిషత్ చైర్మన్ల మొర
• రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చేందుకూ నిధుల్లేవని ఆవేదన
• జిల్లాకు రూ.100 కోట్ల చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి ని«ధుల్లేక అధ్వాన స్థితికి చేరిన జిల్లా పరిషత్‌లకు పునర్వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు విజ్ఞప్తి చేశారు. రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి కూడా అందడం లేదని, జెడ్పీల్లో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు పింఛన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని వాపోయారు. జెడ్పీలకు జవసత్వాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సోమవారం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్లు తుల ఉమ, రాజు, పద్మతోపాటు వివిధ జిల్లాలకు చెందిన కొందరు జెడ్పీటీసీ సభ్యులు పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావును, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు.
నిధుల కొరతతో రోజువారీ నిర్వహణే భారంగా మారిపోయిందని, జెడ్పీ సర్వసభ్య సమావేశాలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని పేర్కొ న్నారు. సమావే శాలకు వచ్చిన జెడ్పీటీసీ సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు చాయ్ బిస్కట్లు పెట్టలేని దుస్థితి నెలకొందన్నారు. 2014 వరకు ఏటా ఒక్కో జిల్లా పరిషత్‌కు రూ.100 కోట్ల మేర నిధులు అందేవని... 14 ఆర్థిక సంఘం నుంచి నిధులను కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకే అందజేస్తున్నందున జెడ్పీ పదవులు అలంకార ప్రాయంగా మారి పోయాయని వాపోయారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామన్న ప్రభుత్వం తక్షణమే అన్ని జెడ్పీలకు కనీసం రూ.100 కోట్ల చొప్పున కేటాయించాలని కోరారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని నిధులు కోరేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్లు తెలిపారు.
విజ్ఞప్తులు, సమస్యలివీ..
⇔ 14వ ఆర్థిక సంఘం నుంచి నేరుగా గ్రామాలకే నిధులు వెళుతుండడంతో జెడ్పీల ద్వారా జరగాల్సిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పలు గ్రామాలను కలిపే లింకు రోడ్లు, జెడ్పీ పాఠశాలలు, గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి పనులు చేపట్టేందుకు నిధులలేమి ఆటంకంగా మారింది.
⇔ గతంలో ఆర్‌ఆర్‌ఎం గ్రాంటు ద్వారా జరిగే పనులకు జెడ్పీ ఆమోదం, పరిపాలనా మంజూరు తర్వాతే నిధులు ఖర్చయ్యేవి. ప్రస్తుతం నేరుగా ప్రభుత్వమే నిధులు మం జూరు చేస్తుండడంతో జెడ్పీలు నిర్వీర్యమ వుతున్నాయి.
⇔ స్థానిక సంస్థలకు తలసరి గ్రాంట్‌ను పెంచాలి. వెంటనే విడుదల చేయాలి.
⇔ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే స్టాంపుడ్యూటీలో జెడ్పీలకు 3 శాతం రావాల్సి ఉండగా.. రెండేళ్లుగా అవి అందడం లేదు.
⇔ గనులు, ఖనిజాల ద్వారా జెడ్పీలకు రావాల్సిన సీనరేజీ ఆదాయాన్ని ప్రభుత్వం అందించడం లేదు.
⇔ ప్రభుత్వం నిధులు విడుదల చేయని ఫలితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో విద్యుత్, టెలిఫోన్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఇంధన చార్జీలు లేక వాహనాలు మూలన పడుతున్న దుస్థితి నెలకొంది.