జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మరో ఎన్నికల సమరానికి అ«ధికారులు సిద్ధమవుతున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సంకేతాలు వస్తున్నాయి. ఇదేకాకుండా ఏ సమయంలో నోటిఫికేషన్ వచ్చినా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై నెలతో ముగియనుంది. ఇక ఈ నెలాఖరులో లేదంటే వచ్చే నెల మొదట్లో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఆ వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు జరగనున్నాయి. మే నెలాఖరులోగా ఈ ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాల కు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు.. అభ్యంతరాలు కూడా స్వీకరించారు. వీటిని పరిశీలించి సోమవారం తుది జాబితా ప్రచురించనున్నారు.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మండలలకు నూతనంగా జెడ్పీటీసీ నియోజకవర్గం ఏర్పాటు చేయాల్సి చేయనున్నారు. అందులో ఎన్ని ఎంపీటీసీ స్థానాలు, ఎంత జనాభా ఉంటందనే వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మండల జనాభాను 3,500 తో భాగించి వచ్చే సంఖ్యను ఎంపీటీసీ స్థానాలుగా గుర్తిస్తారు. అంటే ప్రతీ ఎంపీటీసీ నియోజకవర్గంలో 3 వేల నుంచి 4 లోపు జనాభా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే 6 వేల వరకు కూడా జనాభాతో కూడా ఎంపీటీసీ స్థానం ఏర్పాటుచేస్తారు. ఇలా చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను 22వ తేదీ వరకు స్వీకరించారు. ఇక వచ్చిన అభ్యంతరాలను శని, ఆదివారాల్లో పరిశీలించి సోమవారం తుది జాబితా వెల్లడించనున్నారు.
25లోగా ప్రతిపాదలు
కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా ప్రతిపాదనలను పూర్తిచేసి ఈనెల 25లోగా పంపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. 2019 జనవరి 1 నాటికి ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుంది. ఆ విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలో ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్‌శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల వచ్చే నెలాఖరులోగా ఖరారు చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఇటీవల గ్రామపంచాయతీలకు అమలు చేసినట్లు రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా ఖరారు చేయనున్నారు. ఇక గ్రామపంచాయతీ ఎన్నికల మాదిరిగానే బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముందని సమాచారం. కాగా, జిల్లా కలెక్టర్, ఎస్పీల నివేదికకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలా అనే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
950 ఎంపీటీసీ స్థానాలు
ఉమ్మడి జిల్లా పరిదిలోని 6 జిల్లా వ్యాప్తంగా 950 ఎంపీటీసీ స్థానాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,07,170 జనాభా ఉండగా ఆ ప్రకారం ఎంపీటీసీ స్థానాలను నిర్థారించారు. ఉమ్మడి జిల్లాలో గతంలో 982 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. 2014లో 982 ఎంపీటీసీ స్థానాలు, 64 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే, ప్రభుత్వం నూతన జిల్లాలతోపాటు మండలాలను కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మండలాల సంఖ్య 84కు చేరడంతో అదే సంఖ్యలో జెడ్పీటీసీల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
పెరిగిన జెడ్పీటీసీలు.. తగ్గిన ఎంపీటీసీలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 జెడ్పీటీసీ స్థానాలు పెరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో గతంలో 64గా ఉన్న మండలాల సంఖ్య 84కు చేరిన విషయం విదితమే. దీంతో ప్రతీ మండల ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేస్తూ డ్రాఫ్ట్ విడుదల చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ముసాపేట, రాజాపూర్, గండీడ్(రంగారెడ్డి నుంచి జిల్లాలో కలిసింది), జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోలి, కేటీ.దొడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలో పెంట్లవెల్లి, ఊరకొండ, చారకొండ, పదర, నారాయణపేట జిల్లాలో కృష్ణా, మరికల్, రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్, నందిగామ, చౌదర్‌గూడ, వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అమరచింత మండలాలు ఏర్పాడ్డాయి. వీటికి కూడా అధికారులు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ మేరకు ఆయా స్థానాలు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఉమ్మడి జిల్లాలో 982 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 950కి తగ్గింది. అంటే 32 స్థానాలు తగ్గాయి. ఎంపీటీసీ స్థానాలు ఉన్న ప్రాంతాలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఓటరు జాబితాల తయారీ
ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడినా పాత జిల్లా పరిషత్, వాటి పరిధిలోని మండల పరిషత్‌లో కాలపరిమితి ముగియలేదు. దీంతో వాటి విభజన చేపట్టలేదు. ఇక ఉమ్మడి జిల్లాలో పాతవి 64 మండలాలు ఉండగా అందుకు అనుగుణంగా జెడ్పీటీసీలు, 982 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ మేరకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయలని కలెక్టర్లను పంచాయతీ శాఖ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment