విశాఖలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజ్
- రాష్ట్ర క్రీడల మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ సౌజన్యంతో 200 ఎకరాల స్థలంలో విశాఖపట్నంలోనే క్రీడాగ్రామాన్ని (స్పోర్ట్స్ విలేజ్)ను నిర్మించనున్నట్లు రాష్ట్ర క్రీడల మంత్రి కె.అచ్చెన్నాయుడు వెల్లడించారు. తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియంను నిర్మంచనున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి పూజారి శైలజకు ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం అందలేదని అంగీకరించారు. ఆమెకు నగదు ప్రోత్సాహంతోపాటు స్థలం కూడా అందేటట్టు చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని క్రీడల హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అమరావతిని స్పోర్ట్స్ విలేజ్‌గా మార్చుతామని, 2018లో జరిగే జాతీయ క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, కలెక్టర్ లక్ష్మీనృసింహం, డీఎస్‌డీఓ శ్రీనివాస్‌కుమార్‌లు పాల్గొన్నారు.