పెరగనున్న టీసీఎస్ ఆదాయం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్నా వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదాయం బాగా ఉంటుందని టీసీఎస్ అంచనా వేస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అమెరికా, యూరప్ కంపెనీలు ఐటీ వ్యయాలను పెంచనున్నాయని టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్. చంద్రశేఖరన్ సోమవారం చెప్పారు. అంతేకాకుండా క్లౌడ్, మొబిలిటి, బిగ్ డేటా వంటి టెక్నాలజీల్లో వృద్ధి కూడా ఆదాయ పెంపునకు తోడ్పడుతుందని వివరించారు. సోషల్, మొబైల్, ఎనలటిక్స్, క్లౌడ్(ఎస్‌మ్యాక్) టెక్నాలజీల జోరు పెరుగుతుందని పేర్కొన్నారు. ఫలితంగా కంపెనీకి 3-4 ఏళ్లలో కోట్లాది డాలర్ల ఆదాయ అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం మీద అవుట్ సోర్సింగ్ జోరు పెరగడం, క్లయింట్లలో విశ్వాసం పెరగడం.. ఈ అంశాల కారణంగా భారత ఐటీ-ఐటీఈఎస్ పరిశ్రమకు అపార అవకాశాలు లభిస్తాయని వివరించారు.
అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, రూపాయి ఒడిదుడుకుల ప్రభావాలను భారత ఐటీ పరిశ్రమ అధిగమించగలిగిందని పేర్కొన్నారు. అమెరికా వలస సంస్కరణల బిల్లు మాత్రం ఆందోళన కలిగిస్తోందని వివరించారు. 25 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిచ్చామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాళ్లు ఉద్యోగాల్లో చేరతారని వివరించారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ కోణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గడచిన ఐదేళ్ల కాలంలో అతిపెద్ద సంపద సృష్టి కంపెనీగా నిలిచిందని మోతీలాల్ ఓస్వాల్ 18వ వార్షిక అధ్యయన నివేదిక ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.