ప్రతీకాత్మక చిత్రం
రక్షక భటులే రాక్షసులుగా మారారు. కన్నూమిన్నూ కానకుకండా ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఓ మోడల్ పై అత్యాచారం జరిపి, రూ.4.5 లక్షల నగదు, నగలు దోచుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కీచకపర్వంలో ఒక మహిళా అధికారి సహా ఆరుగురు పోలీసులు గురువారం అరెస్టయ్యారు.
తూర్పు ముంబై ప్రాంతంలోని సకినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 3న ఈ ఘటన జరిగింది. సినిమాలో చాన్స్ కోసం ఓ సార్ట్ హోటల్కు వెళ్లి తిరిగొస్తున్న 29 ఏళ్ల మోడల్ను సివిల్ దుస్తుల్లో ఉన్న ఏఎస్ ఐలు సూర్యవంశి, కతాపే, కానిస్టేబుల్ కొడే అటకాయించారు. తమతో రాకుంటే తప్పుడు కేసు బనాయిస్తామని బెదిరించి, బలవంతంగా జీప్ ఎక్కించుకున్నారు. ఏంఐడీసీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి నాలుగో తేది ఉదయం వరకు సామూహిక అత్యాచారం జరిపారు. విడిపెట్టాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేయడంతో ఆ మోడల్.. తన బాయ్ప్రెండ్కు ఫోన్ చేసి రూ. 4.5 లక్షలు తెప్పించి, పోలీసులకు ఇచ్చింది. ఒంటిమీద నగలు, ఉంగరాలు కూడా ఇచ్చేసింది. ఈ దోపిడీ పర్వంలో ఆ ముగ్గురు కీచకులకు మరో పోలీసు, ఓ మహిళ కూడా సహాయపడినట్లు తెలిసింది.
ఈ దారుణం తర్వాత ప్రాణభయంతో దేశం విడిచివెళ్లిన మోడల్.. కుటుంబ సభ్యులు, స్నేహితులిచ్చిన ధైర్యంతో ఏప్రిల్ 22న ముంబై పోలీస్ కమిషర్ కు ఫిర్యాదుచేసింది. ఎస్సెమ్మెస్ రూపంలో తనపై .జరిగిన అకృత్యాన్ని గురించి ఫిర్యాదుచేసింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ రాకేశ్ మారియా.. నిదితుల్ని అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. అరెస్టు చేసిన ముగ్గురు పోలీసుల్ని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు.