ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి 20 కిలో మీటర్ల దూరాన ఉన్న తోడిక్కి, బురిధి గ్రామాల సమీప అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
మల్కన్‌గిరి:ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి 20 కిలో మీటర్ల దూరాన ఉన్న తోడిక్కి, బురిధి గ్రామాల సమీప అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ముందస్తు సమాచారం మేరకు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో ఆధ్వర్యంలో మావోయిస్టులను చుట్టుముట్టారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. చత్తీస్‌గఢ్ దర్బ డివిజన్‌కు చెందిన 20 మంది మావోయిస్టులు, ప్రస్తుతం జరుగుతున్న మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేసేందుకు ఇక్కడికి రాగా, ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం.
మావోయిస్టుల శిబిరం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను ఎస్పీ మిత్రభాను మహాపాత్రో దగ్గరుండి మల్కన్‌గిరి డీపీఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. పోస్టుమార్టంకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల వేళ మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగలడం గమనార్హం.