
మన యోగాకు మహర్దశ!
ప్రపంచమంతా ఇప్పుడు ఓ కొత్త ఆరంభానికి నాంది పలకనుంది. భారతీయత అందులో ప్రతిబింబించనుంది.
న్యూయార్క్: ప్రపంచమంతా ఇప్పుడు ఓ కొత్త ఆరంభానికి నాంది పలకనుంది. భారతీయత అందులో ప్రతిబింబించనుంది. తొలిసారి ప్రపంచమంతా ఒక రోజును అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యావత్ దేశాల్లోని ప్రజలంతా కూడా ఆదివారం రోజు కొన్ని గంటలపాటు మౌనంలోకి జారుకోనున్నారు. శ్వాసమీద ధ్యాస నిలపనున్నారు. యోగా అనేది భారత దేశానికి చెందిన ప్రత్యేక ప్రాచీన కళ అన్న విషయం తెలిసిందే. దీనివల్ల కలిగే లాభాలేమిటో ఇప్పటికే అన్ని దేశాలు గుర్తించాయి.. గౌరవించాయి కూడా.
ఈ నేపథ్యంలో మిగితా దేశాలమాదిరిగానే అమెరికాలో కూడా భారీ సంఖ్యలోయోగా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించనున్నారు. న్యూయార్క్లోని ప్రముఖ వేదిక అయిన టైమ్స్ స్క్వేర్ వద్దకు రానున్నారు. దాదాపు 30 వేలమందికి పైగా అక్కడ పోగై యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఇక ఐక్య రాజ్య సమితి కార్యాలయంలో అధికారికంగా బాన్ కీమూన్ యోగా దినోత్సవాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఇక ఏయే ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారో ఆయా చోట్ల భారత్ గురించి, భారత్ లోని గొప్ప వ్యక్తులు, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇది భారత్కు దక్కనున్న గొప్ప విజయంగానే భావించొచ్చు.