ఆపదలో 40 మంది విశాఖవాసులు | 40 viskha people struck in iraq | Sakshi
Sakshi News home page

ఆపదలో 40 మంది విశాఖవాసులు

Published Mon, Jun 23 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

ఆపదలో 40 మంది విశాఖవాసులు

ఆపదలో 40 మంది విశాఖవాసులు

ఇరాక్‌లో ఓ కంటైనర్‌లోతిండీ, నీళ్లూ లేకుండా..
వారిని సురక్షితంగా తీసుకురావాలని స్నేహితుల వినతి
ఏజెంట్ మోసంతో నెలలుగా ఢిల్లీలో మరికొందరి పడిగాపులు
‘సాక్షి’తో గోడు వెళ్లబోసుకున్న బాధితులు
 
 సాక్షి, న్యూఢిల్లీ: బతుకుతెరువు కోసం ఇరాక్ వెళ్లిన తెలుగువారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అంతర్యుద్ధంతో అట్టుడుకున్న ఆ దేశంలోని నజాఫ్‌లో దాదాపు 40 మంది విశాఖపట్నం జిల్లా వాసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తమను పనిలోకి తీసుకున్న కంపెనీ తమను ఓ కంటైనర్ ఉంచిందని, తిండీ, నీళ్లూ లేకుండా భయం భయంగా గడుపుతున్నామని, తమను కాపాడాలని వేడుకుంటున్నారు. వీరు ఈ నెల 18నే ఇరాక్ వెళ్లారు. వీరి స్నేహితులు ఆదివారం ఢిల్లీలో ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి ఈ వివరాలు వెల్లడించారు.
 
 బాధితులను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇరాక్ వెళ్లేందుకు ఢిల్లీ వరకు వచ్చి ఏజెంట్ల మోసం వల్ల ఆగిపోయిన మరికొందరు విశాఖ వాసులు కూడా తమకు సాయం చేయాలని కోరారు. రాజమండ్రి సమీపంలోని రావులపాలెం మండలం ఓబలంక గ్రామానికి చెందిన మేడిపాటి వెంకటకృష్ణ అనే ఏజెంట్ తమను ఇరాక్‌కు పంపుతానని మోసం చేశాడని ఆరోపించారు. తమ వద్ద నుంచి లక్షల్లో డబ్బులు దండుకుని, పాస్‌పోర్టులు తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయారు. విశాఖ జిల్లాకు చెందిన  పి. బాపినాయుడు(కసిమికోట), కృష్ణ(హరిపాలెం), ఎం ఉమామహేశ్వరావు, మల్ల అప్పారావు, శివకుమార్, శంకర్, సురేశ్(తిమ్మరాజిపేట) తదితర బాధితులు సాక్షితో గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఇరాక్‌లో మా జిల్లా వాళ్లు 40 మంది దాకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. రెండు రోజుల కిందట మాతో ఫోన్‌లో మాట్లాడారు. ఓ కంటైనర్‌లో ఉన్నామని, భోజనం, నీళ్లు అందడం లేదని చెప్పారు. తమను ఎలాగైనా కాపాడాలని కోరారు’ అని ఉమామహేశ్వరరావు చెప్పాడు. రెండు నిమిషాలే మాట్లాడారని, వాళ్ల ఫోన్లు కలవడం లేదని తెలిపాడు. ఇరాక్ పరిస్థితులు తెలిసి కూడా ఏమీ జరగదని నమ్మించి వెంకటకృష్ణ వారిని ఈ నెల 18న అక్కడికి పంపారని మల్ల అప్పారావు ఆరోపించారు.  
 
 ఢిల్లీలో నెలలుగా పడిగాపులు..: ఇరాక్ వెళ్లేందుకు లక్షల్లో సొమ్ము ఇచ్చి మోసపోయిన బాధితులు ఢిల్లీలో నెలలుగా పడిగాపులు కాస్తున్నారు. వీరిలో కొందరు ఇరాక్ వెళ్లి వచ్చిన వారు కూడా ఉన్నారు. హరిపాలెంకు చెందిన కృష్ణ అనే బాధితుడు మాట్లాడుతూ.. ‘ఫిట్టర్లు, వెల్డర్లకు ఇరాక్‌లో మంచి జీతాలు ఉంటాయని వెంకటకృష్ణ చెబితే ఆశపడ్డాం. ఒక్కొక్కరం రూ.1.5 లక్షల వరకు ఇచ్చాం. మా డబ్బులు, పాస్‌పోర్టులు తీసుకుని మమ్మల్ని మార్చిలో ఇరాక్ పంపారు. బాగ్దాద్ ఎయిర్‌పోర్టులో తనిఖీలో మావి నకిలీ వీసాలని తెలిసి పోలీసులు పట్టుకున్నారు. చాలా ఇబ్బందులు పడి తిరిగొచ్చాం. ఢిల్లీకి వచ్చిన ఏజెంట్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. తిండి తిప్పలు లేవు. వెంకటకృష్ణ మా జిల్లా వాళ్ల నుంచి రూ.60 లక్షలు దండుకున్నాడు’ అని తెలిపాడు. వెంకటకృష్ణ నకిలీ వీసాలు చూపుతూ తమను మోసగిస్తున్నాడని మరో బాధితుడు చెప్పాడు. డబ్బులు, పాస్‌పోర్టుల కోసం ఆనంద్‌నికేతన్‌లోని ఏజెంట్ ఆఫీసు చుట్టూ తిరిగామని, ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారని బాబినాయుడు అనే బాధితుడు చెప్పాడు. ఇరాక్‌లో చిక్కుకున్న తమ స్నేహితులనురప్పించి, ఏజెంట్ మోసాల బారినుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని బాధితులు కోరారు.
 
 బాధితుల వివరాలు సేకరించిన ఏపీ ప్రభుత్వం
 
 బాధితుల గోడుపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కార్యాలయ వర్గాలు బాధితులు వివరాలతోపాటు, ఇరాక్‌లో చిక్కుకున్న వారి వివరాలను సేకరించాయి. ఈ అంశాన్ని సోమవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్తామన్నాయి.
 
 మరో రెండు పట్టణాలు మిలిటెంట్ల చేతికి..
 
 బాగ్దాద్: ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్లు మరో రెండు పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక అల్ కాయిమ్ క్రాసింగ్‌పై పట్టు సాధించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ జిహాదీలు ఆదివారం రవా, అనా పట్టణాలను చేజిక్కించుకున్నారు. వీరి ధాటికి ఈ పట్టణాలతో పాటు, అల్ క్వాయిమ్ నుంచి ప్రభుత్వ బలగాలు వ్యూహాత్మకంగా తప్పుకున్నాయి. అక్కడి తిరిగి మోహరించేందుకే తప్పుకున్నామని ప్రభుత్వం తెలిపింది. మిలిటెంట్ల స్వాధీనంలోని తిక్రిత్‌లో వాయుసేన దాడుల్లో ఏడుగురు పౌరులు చనిపోయారు. సున్నీ మిలిటెంట్లు తమ అధీనంలోని మోసుల్‌లో షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. కాగా, ఇరాక్ మిలిటెంట్లు బలం పుంజుకుని, పొరుగు దేశాలనూ అస్థిరపరచే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాక్‌లో బందీలైన భారతీయుల విడుదల కోసం ఇరాక్‌లో భారత రాయబారిగా పనిచేసిన సురేశ్ రెడ్డి అక్కడి అధికారులతో చర్చిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement