బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు: 47 మంది మృతి
కరాచీ: పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి నరమేథం సృష్టించారు. కరాచీలో బుధవారం ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిగిన దుర్ఘటనలో 16 మంది మహిళలు సహా 47మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. నగరంలోని సఫోరా గోథ్ ప్రాంతంలో బైకులపై వచ్చిన ఆరుగురు సాయుధ ముష్కరులు.. షియా వర్గానికి చెందిన ప్రయాణికులే లక్ష్యంగా బస్సుకు అన్ని వైపుల నుంచి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 47మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తప్పించుకునే మార్గం లేకపోవడంతో కూడా ప్రాణానష్టం ఎక్కువగా ఉండటానికి కారణమయిందని పోలీసులు చెప్పారు. దుర్ఘటన సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు తెలిసింది. ముష్కరులు కాల్పులు జరిపిన బస్సు.. నగరంలోని అల్- అజహర్ గార్డెన్ కాలనీకి చెందినదిగా గుర్తించారు. అందులో ప్రయాణిస్తోన్న 50 మంది కూడా షియా వర్గానికి చెందినవారేనని పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలికి చేరుకున్న భద్రతా బలగాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో పాకిస్తాన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
కరాచీలోని సఫూరా చౌక్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామేనని తెహ్రీకే తాలిబన్ ప్రకటించుకుంది. 9ఎం.ఎం. పిస్టల్‌తో ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మూడు బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కాల్పులు జరిపినట్టు సమాచారం. బస్సుపై ఎటువంటి బుల్లెట్ గుర్తులు లేకపోవడంతో... ఉగ్రవాదులు బస్సులోపలికి వచ్చి కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు.
ఇస్మాయిలీ షియా వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. బస్సులో ఉన్నవాళ్లంతా ఇస్మాయిలీ ముస్లింలేనని తెలుస్తోంది. పాకిస్థాన్‌లో ఉంటున్న ఇస్మాయిలీ ముస్లింలు చాలా మటుకు రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో వీరు ఎక్కువగా పనిచేస్తుంటారు. గతంలో కూడా ఇస్మాయిలీ షియాలపై పాకిస్థాన్‌లో దాడులు జరిగాయి.