'పాక్ ప్రజలకు అండగా ఉందాం'
పాకిస్థాన్లో ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపి 47 మంది షియా మైనారిటీలను హతమార్చడాన్ని అత్యంత దారుణ చర్యగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఉగ్ర కాల్పుల్లో మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి విపత్కర సమయంలో పాకిస్థాన్ ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం కరాచీలోని సఫోరా గోథ్ ప్రాంతంలో షియా వర్గంవారు ప్రయాణిస్తోన్న బస్సుపై తెహ్రీక్- ఏ- తాలిబన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మహిళలు సహా 47 మంది దుర్మరణం చెందారు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అరెర్ట్ ప్రకటించింది.