హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఖైదీలు, పోలీసులకు మధ్య ఘర్షణ(2011 నాటి ఫొటో)
కరాచీ: పెషావర్ సైనిక స్కూల్ పై దాడి అనంతరం ఉగ్రవాదాన్ని అంతమొందిస్తానని ప్రతినబూనిన పాకిస్థాన్ బుధవారం 100 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ జైలు విధ్వంసం కుట్ర, కరాచీలోని మెహ్రం ఎయిర్ బేస్, జిన్నా ఎయిర్ పోర్టులపై దాడులు, కమ్రాలోని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోకి చొరబాటు తదితర కుట్రల్లో పాలుపంచుకున్న ఉగ్రవాదుల అరెస్ట్ ఉగ్రవ్యతిరేక పోరులో కీలక ఘట్టమని, అరెస్టయిన వారిలో అల్- కాయిదా, లష్కరే జంగ్వి, తెహ్రీక్ ఏ తాలిబన్ తదితర సంస్థలకు చెందినవారని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెప్టినెంట్ జనరల్ ఆసిమ్ సలేమ్ బజ్వా తెలిపారు.
భారత్ భద్రతా బలగాలకు పట్టుబడి, '1999 కందహార్ హైజాక్' ఉదంతంలో అనూహ్యంగా విడుదలైన అహ్మద్ ఒమర్ సయ్యద్.. ఆ తర్వాతి కాలంలో అల్ కాయిదా చీఫ్ గా ఎదిగాడు. ప్రస్తుతం మరణశిక్షగు గురైన అతను సంధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. గతేడాది ఫిబ్రవరిలో జైలును ధ్వంసం చేసి ఒమర్ ను తమతో తీసుకెళ్లాలని ఉగ్రవాదులు కుట్రపన్నారు. అయితే పోలీసులుల అప్రమత్తతతో ఉగ్రవాదుల వ్యూహం బెడిసికొట్టింది. కరాచీ ఆపరేషన్ గా నామకరణం చేసిన ఉగ్రవాదుల పట్టివేత ఆపరేషన్ లో ఇప్పటివరకు 12 వేల మందిని అరెస్టు చేశామని, 7 వేలకు పైగా దాడులు నిర్వహించామని సలేమ్ బజ్వా పేర్కొన్నారు.