ఇరాక్లో దాడులు నిత్యకృత్యం అయిపోయాయి. మధ్య, తూర్పు ఇరాక్ ప్రాంతాల్లో వరుసగా నిన్న చోటు చేసుకున్న దాడులల్లో 56 మంది మరణించారని పోలీసులు తెలిపారని స్థానిక మీడియా బుధవారం ఇక్కడ వెల్లడించింది. ఆ దాడుల్లో దాదాపు170 మంది వరకు
గాయాలపాలైయ్యారని వివరించింది. వారంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించింది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలోనే మంగళవారం సాయంత్రం 12 కారు బాంబు పేలుళ్ల సంభవించాయి. వాటిలో రెండు ఈశాన్య బాగ్దాద్ సమీపంలోని హుస్సేయినీ ప్రాంతంలోని నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ వద్ద పేలాయని తెలిపింది. అలాగే నిత్యం జనసమర్థంగా ఉండే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కారు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయని వివరించింది.
అలాగే దక్షిణ బాగ్దాద్లోని అరబ్ జుబొర్ శివారు ప్రాంతంలో ఓ కుటుంబంపై ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో మొత్తం ఐదుగురు మరణించారని పేర్కొంది. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది.