
భారత్ మా సైనికుల్ని చంపేసింది: పాక్ ఆర్మీ
ఇస్లామాబాద్: భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు చనిపోయారని ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. ఆదివారం రాత్రి భారత దళాలు నియంత్రణ రేఖ వద్ద బీంబర్ సెక్టార్‌లోని తమ స్థావరాలపై దాడి చేసినట్టు పాక్ ఆర్మీ వెల్లడించింది.
భారత సైనికుల కాల్పులకు ప్రతిగా తమ దళాలు ఎదురు కాల్పులు జరిపాయని తెలిపింది. భారత స్థావరాలను లక్ష‍్యంగా చేసుకుని దాడులు చేసినట్టు పేర్కొంది. భారత సైనికులు చేస్తున్న దాడుల్లో ఎక్కువగా తమ పౌరులు చనిపోతున్నారని పాక్ ఆర్మీ, విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు.
జమ్ము కశ్మీర్‌లో ఉడీఉగ్ర దాడి అనంతరం భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష‍్యంగా చేసుకుని భారత సైనికులు సర్జికల్ దాడులు చేశారు. కాగా పాక్ వీటిని తోసిపుచ్చింది. ఆ తర్వాత పాక్ 100 సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు భారత దళాలు పేర్కొన్నాయి. పాక్ దాడులకు భారత సైనికులు దీటుగా బదులిస్తున్నారు.