చనిపోయినట్లు నటించి.. రేపిస్టు నుంచి తప్పించుకుంది
ఆ అమ్మాయి వయసు కేవలం ఎనిమిదేళ్లు. ఢిల్లీలోని కిరారి అనే ప్రాంతంలో అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత చనిపోయినట్లు నటించి, రేపిస్టు బారి నుంచి తప్పించుకుంది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఆరుబయట మంచం మీద పడుకొని ఉన్న చిన్నారిని ఓ దుర్మార్గుడు ఎత్తుకుపోయాడు. ఆమెకు తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి ఇంట్లో కాకుండా వేరే ఎక్కడో.. ఎవరి పక్కనో ఉన్నట్లు గమనించి గట్టిగా అరిచేందుకు ప్రయత్నించింది. కానీ, అతడు ఆమె నోరు మూసేశాడు. తర్వాత అతడు తనను చంపేస్తాడేమోనన్న భయంతో ఆమె కదలకుండా ఉండిపోయి, చనిపోయినట్లు నటించింది.
దాంతో నిందితుడు బాగా భయపడ్డాడు. ఆమెను గిల్లి చూశాడు. అయినా ఆమె కదల్లేదు. అతడు దూరంగా వెళ్లగానే ఆమె లేచి ఇంటివైపు పరుగు తీసింది. అది చూసి అతడు కూడా ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశాడు గానీ, రాయి తగిలి కింద పడిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నారి దుస్తుల మీద రక్తపు మరకలు చూసి తల్లిదండ్రులు హడలిపోయారు. తనకు పొత్తికడుపులో నొప్పిగా ఉందని చెప్పి, తర్వాత ఏడుస్తూ జరిగిన ఘోరం వివరించింది. ఆ చిన్నారి ఓ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతోంది.