
4 కోట్ల నయా ఓటర్లు!
వచ్చే లోక్‌సభ ఎన్నికలలో దాదాపు 81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 2009 సాధారణ ఎన్నికలతో పోల్చితే 10 కోట్ల మంది ఎక్కువ.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఓటేసేది 81 కోట్ల మంది
2009 ఎన్నికల కన్నా 10 కోట్ల మంది ఎక్కువ
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
‘ఓటరుగా గర్వించు.. ఓటేసేందుకు సిద్ధంగా ఉండు’ అంటూ శుక్రవారం ఒడిశాలోని పూరీలో సముద్రతీరాన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ చెక్కిన సైకత శిల్పం..
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలలో దాదాపు 81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 2009 సాధారణ ఎన్నికలతో పోల్చితే 10 కోట్ల మంది ఎక్కువ. మరో విశేషమేమిటంటే దేశవ్యాప్తంగా గత మూణ్నెల్ల కాలంలోనే దాదాపు 3.91 కోట్ల మంది కొత్తగా ఓటర్ల జాబితాలో చేరారు. వారిలో 1.27 కోట్లకు పైగా 18 నుంచి 19 ఏళ్ల వయసువారే. అయితే వచ్చే సాధారణ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేటప్పటికి (ఈనెల 31న తుది జాబితా ముద్రణ) ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ డెరైక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం శనివారం నిర్వహించనున్నారు.
ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రౌత్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, 2013లో ఓటర్ల దినోత్సవం నాటికి 2.32 కోట్ల మంది కొత్త ఓటర్లు చేరారని, వారిలో 18-19 ఏళ్ల వయసువారు 93 లక్షల మంది ఉన్నారని చెప్పారు. అలాగే 2012లో 3.83 మంది కొత్త ఓటర్లు చేరగా, వారిలో 18-19 ఏళ్ల వయసువారు 1.09 కోట్ల మంది ఉన్నారని వెల్లడించారు. కాగా, అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పిలుపునిచ్చారు.
లోక్‌సభ ఎన్నికలు ఓటర్లు (కోట్లలో)
2004 67.10
2009 71.40
2014 81 (అంచనా)