
మా పాలిట దేవుడు వైఎస్
కాంగ్రెస్ ధర్నాలో ఓ రైతు ఉద్వేగభరిత ప్రసంగం
అచ్చంపేట రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన హయాంలోనే వ్యవసాయాన్ని పండగలా చేశామని ఓ రైతు పేర్కొన్నాడు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన కాంగ్రెస్ ధర్నాలో పలువురు రైతులు దివంగత నేత వైఎస్‌ను స్మరించుకున్నారు. ఉప్పునుంతల మండల రైతులు సాకలి జంగయ్య అక్కడే ఓ నాయకుడి చేతిలో ఉన్న మైక్‌ను తీసుకుని తన ఆవేదన వ్యక్తపరిచారు.
కాంగ్రెస్ నేతలు వైఎస్ పేరును ప్రస్తావించకుండా వారిస్తున్నా.. వినిపించుకోలేదు. రాజశేఖరరెడ్డి రైతుల కోసమే ప్రతి పథకం ప్రవేశపెట్టారని, రైతుల పాలిట ఆయన దేవుడిగా నిలిచిపోయారన్నారు. ప్రస్తుతం కరువు తాండవిస్తున్నా రైతులను, మూగజీవాలను పట్టించుకునే నాథుడేలేడని వాపోయారు. గ్రామాల్లో గుడిసెలు లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన వాళ్లకు అన్నం పెట్టడం లేదని, అడగనోళ్లకు మాత్రం అన్నీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. అన్నమో రామచంద్రా! అని తల్లడిల్లుతుంటే మద్యాన్ని చౌకగా అందిస్తామంటున్నారని మండిపడ్డారు. ఈ సమయంలో ప్రతి కార్యకర్త ఈలలు వేస్తూ.. జై వైఎస్‌ఆర్! అని నినదించారు.