
ఆధార్ ఐచ్ఛికమే: సుప్రీం కోర్టు
ప్రభుత్వ పథకాలకు తప్పనిసరి చేయరాదు.. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు
న్యూఢిల్లీ: పౌరులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందటానికి ఆధార్ కార్డును తప్పనిసరి చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజాపంపిణీ పథకం, ఆహార ధాన్యాలు, కిరోసిన్, వంట గ్యాస్ పంపిణీకి మినహా మరే ఇతర అవసరాలకూ ఆధార్ కార్డును వినియోగించరాదని స్పష్టంచేసింది. ఆధార్ నమోదుకు సేకరించిన వ్యక్తిగత బయోమెట్రిక్ సమాచారాన్ని వేరెవరికీ ఇవ్వరాదని అధికారులకు నిర్దేశించింది.
సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డులను తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డుల తయారీ కోసం బయోమెట్రిక్ వివరాలను సేకరించటం.. ఒక వ్యక్తికి గల వ్యక్తిగత గోప్యతను(ప్రైవసీని) ఉల్లంఘించినట్లవుతుందా? ఆ గోప్యత హక్కు ప్రాథమిక హక్కు కిందకు వస్తుందా? అనే విస్తృత అంశాలపై నిర్ణయించటానికి ఆ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాల్సిందిగా చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తుకు సిఫార్సు చేసింది.
వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కయితే దాని పరిధి ఏమిటో నిర్ణయించాలంది. ఆధార్‌ను ప్రజాపంపిణీ, కిరోసిన్, గ్యాస్ రాయితీలకు సంబంధించి మినహా మిగతా వాటికి వాడరాదని, ఈ సౌకర్యాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదంది. యూఐడీఏఐ ద్వారా సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని ఏ ఇతర అవసరాలకు వినియోగించరాదని.. అయితే క్రిమినల్ కేసుల విచారణలో కోర్టు అనుమతితో ఆ సమాచారాన్ని వినియోగించవచ్చని పేర్కొంది.
అలాగే.. ఆధార్ నమోదు కోసం సేకరించిన పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక ప్రయోజనాల పథకాలకు మినహా మరే ఇతర అవసరాలకూ వినియోగించబోమని ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేసిన తర్వాత.. పౌరుల అంగీకారం మేరకే ఆధార్ జారీ చేస్తామన్న ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. ఇదే సమయంలో.. ఆధార్ నమోదును నిలిపివేయాలంటూ దాఖలైన మధ్యంతర అభ్యర్థనలను ధర్మాసనం స్వీకరించలేదు.
అంతకుముందుకు పిటిషనర్ల న్యాయవాదులు వాదిస్తూ.. ఆధార్ కార్యక్రమం కింద వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, దానిని వేరే వారితో పంచుకోవడం వ్యక్తిగత సమాచార గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనన్నారు. కేంద్రం తరఫున రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఆధార్ కార్యక్రమాన్ని సమర్థించారు. వ్యక్తిగత సమాచార గోప్యత ప్రాథమిక హక్కు కాదన్నారు. ఇందుకు మద్దతుగా విస్తృత ధర్మాసనాల తీర్పులు ప్రస్తావించారు. అయితే.. తక్కువ సభ్యులున్న ధర్మాసనాలు విరుద్ధ అభిప్రాయాలు చెప్పాయి కాబట్టి.. దీనిపై విస్తృత ధర్మాసనం ఒక నిర్ణయం చేయాల్సిన అవసరముందన్నారు.