ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి ఈసీకి పోటీగా హ్యాకథాన్‌ను నిర్వహిస్తామని ఆమ్ ఆప్ తెలిపింది.
న్యూఢిల్లీ : ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి ఈసీకి పోటీగా జూన్ 3న హ్యాకథాన్‌ను నిర్వహిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఇందుకు సాంకేతిక నిపుణులు, రాజకీయ పార్టీలు, ఈవీఎం తయారీ కంపెనీలతో పాటు ఈసీని కూడా ఆహ్వానిస్తామని ఆప్ ఢిల్లీయూనిట్ కార్యదర్శి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఈసీ కంటే మెరుగైన, పారదర్శకమైన హ్యాకథాన్‌ను నిర్వహిస్తామని భరద్వాజ్ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రదర్శించిన ఈవీఎంలనే ఇందుకు ఉపయోగిస్తామని తెలిపారు.
హ్యాకథాన్‌లో భాగంగా ట్యాంపరింగ్ కోసం ఈవీఎంలోని భాగాల్ని మార్చడానికి ఈసీ అనుమతించకపోవడంపై భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధనను తొలగించాలని తాము ఇప్పటికే ఈసీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ నిబంధనల ప్రకారమే ఈసీ తమ ఈవీఎంను ట్యాంపరింగ్ చేయాలని భరద్వాజ్ సవాలు విసిరారు. జూన్ 3న హ్యాకథాన్ కోసం ఈసీ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. కానీ సీపీఐ(ఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లు మాత్రమే ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి.