అసెంబ్లీలో ‘ఈవీఎం’ రిగ్గింగ్!
ఢిల్లీలో రహస్య కోడ్‌తో ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ డెమో
► ఓటు రసీదు ఈవీఎంలతో ఎన్నికలు జరపాలంటూ తీర్మానం
► అది నకిలీ ఈవీఎం: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ అసెంబ్లీలో ప్రయోగపూర్వక ప్రదర్శన ఇచ్చింది. దీనికోసమే మంగళవారం రోజంతా నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ స్పీకర్ అనుమతితో ఈవీఎంను పోలిన యంత్రాన్ని రిగ్గింగ్ చేశారు.
ఈవీఎంలో సీక్రెట్ కోడ్‌ను ప్రవేశపెట్టిన సౌరభ్ 10 ఓట్లు ఆప్‌కు పడేలా నొక్కారు. తర్వాత డిస్‌ప్లే ప్యానల్‌పై ఆ ఓట్లన్నీ బీజేపీకి పడినట్లు కనిపించింది. ‘సీక్రెట్ కోడ్‌ను ఈవీఎంలో ప్రవేశపెట్టి ఓట్లన్నీ ఒకే పార్టీ అభ్యర్థికి పడేలా చేయొచ్చు. ఈ అక్రమం ఏ తనిఖీలోనూ బయటపడదు’ అని కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన సౌరభ్ చెప్పారు. ఇటీవల పలు ఎన్నికల్లో ఓడిపోయిన ఆప్.. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే తాము ఓడిపోయామని చెబుతుండటం తెలిసిందే.
90 సెకన్లలో..: ‘90 సెకన్లలో మదర్ బోర్డును మార్చవచ్చు. ఈవీఎంపై ప్రతిపార్టీకి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది.. ఓటింగ్ సమయంలో పార్టీ కార్యకర్త ఈవీఎంలోకి సీక్రెట్ కోడ్‌ను ప్రవేశపెడతారు. తర్వాత పడే ఓట్లన్నీ ఆ పార్టీకే ఓట్లు పడతాయి’ అని డెమో సందర్భంగా జరిగిన చర్చలో సౌరభ్ తెలిపారు. గుజరాత్‌లో ఎన్నికలు జరిగే చోట్ల ఈవీఎంలను తనకు 3 గంటలపాటు అప్పగిస్తే బీజేపీ ఒక్క బూత్‌లోనూ గెలవలేదన్నారు. ఒక సాధారణ ఇంజినీరుగా ఈ అంశంపై విస్తృతంగా పనిచేశానని, ఈ యంత్రాలతో ఎలా మోసం చేయొచ్చో తనకు తెలుసని అన్నారు. హ్యాక్‌కు వీలుకాని యంత్రం ప్రపంచంలోనే లేదని, ఈవీఎంను హ్యాక్ చేయడం అసాధ్యమని నిరూపించాలని శాస్త్రవేత్తలకు సవాల్ విసిరారు.
డెమోకు జెడీయూ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జేడీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు కపిల్ మిశ్రా, ఆసీమ్ ఖాన్‌లూ హాజరయ్యారు. ఓటరు వేసిన ఓటు అతను ఎంచుకున్న అభ్యర్థికే పడినట్లు రసీదు పొందే సదుపాయం (వీవీపీఏటీ)తో కూడిన ఈవీఎంలతో ఎన్నికలు జరపాలని రాష్ట్రపతిని కోరుతూ సభ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ... ‘ట్యాంపరింగ్ ప్రజాస్వామ్యానికి, దేశానికి ప్రమాదం. ఈసీ తన యంత్రాలను మాకిస్తే కేవలం మదర్‌బోర్డు మార్చడం ద్వారా వాటిని ఎలా హ్యాక్ చేయొచ్చో 90 సెకన్లలో చూపిస్తాం’ అని అన్నారు.
వాటిని ముందుగానే ప్రోగ్రాం చేయొచ్చు..
ఈ డెమోకు వాడిన యంత్రం ఎన్నికల్లో తాము ఉపయోగించే ఈవీఎంలా లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ‘ఈసీ వాడే ఈవీఎంకు భిన్నమైన నకిలీ యంత్రాలను ఎలా పనిచేయాలో ముందుగానే ప్రోగ్రాం చేయొచ్చు. అంతమాత్రాన ఈసీ ఈవీఎంలు కూడా అలాగే పనిచేస్తాయని భావించకూడదు. అవి సాంకేతికంగా భద్రమైనవి..’ అని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, డెమోకు వాడిన యంత్రాన్ని ఐఐటీల్లో చదివిన కొందరు తయారు చేశారని ఆప్ వర్గాలు తెలిపాయి.