బ్యాంకులకు సామర్థ్య పరీక్ష
ముంబై: బ్యాంకుల సామర్థ్య పరీక్షకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలబడే విధంగా రూపొందించిన ఈ నిబంధనలు 2014 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. బ్యాంకులు వాటి వ్యాపారం, పరిధి, నష్టభయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సామర్థ్య పరీక్షను నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇందుకోసం బ్యాంకులను వాటి వ్యాపార పరిమాణం ఆధారంగా మూడుగా విభజించింది. రూ. రెండు లక్షల కోట్ల వ్యాపారం పరిమాణం దాటిన వాటిని మొదటి తరగతి కింద, రూ.50 వేల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లలోపు రెండో తరగతి, రూ.50 వేల కోట్లు కంటే తక్కువ ఉన్న బ్యాంకులను మూడో తరగతిగా విభజించింది.
ప్రస్తుతమున్న సామర్థ్య పరీక్ష ఈ మధ్య వచ్చినటువంటి అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో ఈ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చిట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే 2015 నుంచి బ్యాంకులు అదనంగా 0.80% వరకు టైర్-1 క్యాపిటల్‌ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలపై సూచనలు, సలహాలు ఇవ్వడానికి డిసెంబర్ 31 వరకు అనుమతించింది.