రేప్‌కు అంగీకరించలేదని చంపేశా!
- ఏడేళ్ల బాలుడిని చంపిన కిరాతక బస్ డ్రైవర్ వాంగ్మూలం
- ర్యాన్ అంతర్జాతీయ స్కూల్ వద్ద పెద్ద ఎత్తున ప్రజాగ్రహం
- స్కూల్ ప్రిన్సిపాల్‌పై వేటు
న్యూఢిల్లీ: గుర్గావ్‌లో ఏడేళ్ల బాలుడిని కిరాతకంగా హతమార్చిన కిరాతక బస్ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. బాలుడిపై లైంగిక దాడికి తాను ప్రయత్నించానని, దీనిని బాలుడు ప్రతిఘటించడంతో చంపేశానని తెలిపాడు. 42 ఏళ్ల అశోక్ కుమార్ గుర్గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఎనిమిది నెలలుగా బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
శుక్రవారం స్కూల్ టాయలెట్‌లో ఏడేళ్ల బాధిత బాలుడు ఒంటరిగా కనిపించాడని, దీంతో అతనిపై లైంగిక దాడిచేసేందుకు ప్రయత్నించగా.. బాలుడు తప్పించుకునేందుకు యత్నించాడని, దీంతో అతన్ని టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లి గొంతు కోసేశానని, కత్తితో బాలుడిని రెండుసార్లు పొడిచానని అతడు తెలిపాడు. అంతేకాకుండా కత్తిని కడిగి అదే ప్రదేశంలో పారేశానని చెప్పాడు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలతో నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, గుర్గావ్‌ను దిగ్భ్రాంతపరిచిన ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం పెల్లుబుక్కుతోంది. పెద్దసంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు బాలుడి హత్యకు వ్యతిరేకంగా ర్యాన్ అంతర్జాతీయ స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ఈ ఆందోళన కొనసాగుతోంది. స్కూలు యాజమాన్యమే బాలుడి హత్యకు కారణమని నిరసనకారులు మండిపడుతున్నారు. మరోవైపు స్కూలు తాత్కాలిక ప్రిన్సిపాల్ నీరజ బత్రాపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు విధించింది. స్కూలుపై 100 కోట్ల జరిమానా విధించాలని, స్కూల్‌ను వెంటనే మూసివేయాలని ఆలిండియా పెరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.