న్యూఢిల్లీ: ముంబైలో 23 ఏళ్ల ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచార ఘటనను దేశం యావత్తూ ముక్త కంఠంతో ఖండించింది. దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలిపాయి. పార్టీలకతీతంగా నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు గ్యాంగ్‌రేప్‌ను ఖండించారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటన అని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు నిర్భయ చట్టాన్ని వర్తింపచేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ముంబైలో ఈ ఘటన జరిగిందని బీజేపీ ఆరోపించింది.
శిక్ష పడుతుందనే భయం లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పారు. ఈ తరహా ఘటనలపై కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సీపీఎం నాయకురాలు బృందా కారత్ అన్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ తర్వాత మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మాట్లాడుతూ.. మహిళలపై ఈ తరహా దాడులను తీవ్రంగా పరిగణిస్తామని, దేశంలో మహిళలు, చిన్నారులను అభద్రతాభావంలో వదలలేమని చెప్పారు.
రాజ్యసభలో దుమారం..: ముంబై సామూహిక అత్యాచార ఘటనపై రాజ్యసభ అట్టుడికింది. జీరో అవర్‌లో ఈ అంశాన్ని సభ్యులు లేవనెత్తారు. మహిళలపై లైంగిక దాడులు పెరగడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్-బీజేపీ ఎంపీలు మాటల యుద్ధానికి దిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయని, ముంబై ఘటనను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. దీంతో హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ స్పందిస్తూ.. ఇది విషాదకరమైన ఘటన అని, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్టు తెలిపారు. తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధ్యులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించినట్టు వెల్లడించారు.
పాటిల్ రాజీనామా చేయాలి: రాజ్ థాకరే
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రిగా ఆర్‌ఆర్ పాటిల్ విఫలమయ్యారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాకరే డిమాండ్ చేశారు. హోంశాఖను నడిపించే సామర్థ్యం పాటిల్‌కు లేదని, అందువల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించిపోయాయని ఆరోపించారు.
బీజేపీ మహారాష్ట్ర శాఖ కూడా పాటిల్ రాజీనామాకు డిమాండ్ చేసింది. హోంశాఖపై ఆయనకు ఏవిధమైన పట్టు లేదని వ్యాఖ్యానించింది. అయితే పాటిల్ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం తగదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ చెప్పారు. సామూహిక అత్యాచార ఘటన ముంబైకి, మానవత్వానికి సిగ్గుచేటని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈ ఘటన ముంబైకి చాలా అవమానమని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు. కాగా, జర్నలిస్టులతో పాటు వేలాది మంది ప్రజలు ముంబైలో మౌన నిరసన తెలిపారు.
కఠిన చర్యలు తీసుకోవాల్సిందే..
Published Sat, Aug 24 2013 4:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement