భారత్‌కు 10 బిలియన్ డాలర్ల రుణం
న్యూఢిల్లీ: భారత్‌కు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఐదు సంవత్సరాల కాలంలో (2013-17) 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.62,000 కోట్లు) రుణ సహాయాన్ని చేయనుంది. 2017 వరకూ వార్షికంగా 2 బిలియన్ డాలర్ల చొప్పున బ్యాంక్ ఈ సహాయాన్ని అందజేస్తుంది. ఏడీబీ-కేంద్ర ప్రభుత్వాలు ఈ మేరకు ఒక వ్యూహాత్మక భాగస్వామ్య వ్యూహాన్ని కుదుర్చుకున్నాయి. మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఏడీబీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
లక్ష్యాలు ఇవీ...: 12వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ నిధులు కొంత దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపాధి అవకాశాల కల్పన, పెట్టుబడుల సంస్కరణల అమలు, మౌలిక రంగం పురోభివృద్ధి లక్ష్యంగా ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ధి సేవలు, జలవనరుల సరఫరా, అభివృద్ధి వంటి అంశాల్లో ఈ నిధులను వెచ్చించనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
భారత్ చర్యలు భేష్...: ఆర్థిక స్థిరత్వం, రూపాయి స్థిరీకరణ, మౌలిక రంగ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల అమలు వంటి అంశాల్లో భారత్ విశ్వసనీయ చర్యలు తీసుకుంటోందని ఏడీబీ దక్షిణ ఆసియా అభివృద్ధి వ్యవహారాల డెరైక్టర్ జనరల్ జూయిన్ మిరాందా పేర్కొన్నారు. కాగా, కొన్ని క్లిష్టమైన విధాన సమస్యలు పరిష్కారమయితే భారత్ అధిక వృద్ధి సాధ్యమేనని ఏడీబీ పేర్కొంది. పారిశ్రామిక భూ సేకరణ, సహజ వనరులకు సంబంధించి లెసైన్సుల మంజూరుల్లో ఇబ్బందులు తొలగిపోవాల్సిన ఉందని సూచించింది.