నేడు అజర్‌బైజాన్‌కు జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం అజర్‌బైజాన్‌కు వెళ్లనున్నారు. రాజధాని బకూలో జరుగుతున్న ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వార్షిక సమావేశాల్లో పాల్గొనడం ఈ పర్యటనలో ప్రధాన అంశం. ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ మహర్షిసహా పలువురు ఆర్థికశాఖ సీనియర్ అధికారులు ఇప్పటికే ఏడీబీ గవర్నర్‌ల బోర్డ్ సమావేశాల్లో పాల్గొనడానికి బకూకు చేరుకున్నారు. నేడు ప్రారంభమైన 48వ ఏడీబీ వార్షిక సమావేశాలు నాలుగురోజుల పాటు జరగనున్నాయి.
పర్యటన అనంతరం జైట్లీ మే 5న భారత్‌కు తిరిగి వస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వస్తువుల సేవల పన్ను, బ్లాక్‌మనీ బిల్లు వంటి కీలక ఆర్థిక అంశాలు ప్రస్తుతం పెండింగులో ఉండడమే దీనికి కారణం. ఆయా బిల్లులు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం లోక్‌సభ ఆమోదం పొందిన ఫైనాన్స్ బిల్లు 2015కు కూడా రాజ్యసభ ఆమోదం లభించాల్సి ఉంది.
ఏడీబీ దృష్టి పెట్టే అంశాలు..!
ప్రపంచ ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, వాతావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రస్తుత ఏడీబీ సమావేశాలు దృష్టి పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మౌలిక రంగం, విద్య, ప్రాంతీయ సహకారం, ఆర్థిక రంగం అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.