
వైద్య కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్ష
ఎంబీబీఎస్, బీడీఎస్, పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలకు
ఎంసీఐ ఆమోదం
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్, పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు తమ సిఫారసులను కేంద్ర ఆరోగ్యశాఖకు పంపించింది. ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశపరీక్షలకు సంబంధించిన ప్రతిపాదనలపై ఎంసీఐ అభిప్రాయం కోరిందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీనికి ఈనెల 1వ తేదీన ఎంసీఐ సర్వసభ్య సమావేశం ఆమోదముద్ర వేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు, వివిధ ప్రైవేటు మెడికల్ కళాశాలల సంఘాలు సొంతంగా ప్రవేశపరీక్షలు నిర్వహించుకుంటున్నాయి.
విద్యార్థులు విడివిడిగా ఆయా ప్రవేశపరీక్షలు రాయాల్సి వస్తోంది. ఉమ్మడి ప్రవేశపరీక్షల విధానం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు లాభం కలుగుతుందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కాగా, 2009లోనే ఎంసీఐ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినప్పటికీ, ఎంసీఐ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం 1956కు సవరణ తేవాలని, దానివల్ల ఉమ్మడి పరీక్షపై నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుందని ఎంసీఐ ప్రభుత్వాన్ని కోరింది.