'మోడీతో ఒబామా భేటీ ఆన్ లైన్ సంతకాలు' తొలగింపు!
వాషింగ్టన్: భారత్ ప్రధాని నరేంద్రమోడీతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమావేశాన్ని రద్దు చేసుకోవాలని దాఖలైన ఆన్ లైన్ సంతకాలను వైట్ హౌస్ తొలగించింది. నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో వచ్చేనెల తలపెట్టిన భేటీని ఒబామా రద్దుచేసుకోవాలంటూ ఆన్‌లైన్‌లో నమోదైన పిటీషన్లలోని 85వేల సంతకాలను అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ తొలగించివేసింది. మోడీకి వ్యతిరేకంగా ఆన్‌లైన్ పిటిషన్‌లోని ఉంచిన సంతకాల్లో అక్రమాలపై ఈ నెల 10న పరిశీలన జరిపామని, నిబంధనలకు అతిక్రమించేలా ఉన్న సంతకాలను పిటిషన్‌నుంచి తొలగించామని వైట్‌హౌస్ జాతీయ భద్రతా వ్యవహారాల మండలి ప్రతినిధి కాట్లిన్ హేడెన్ చెప్పారు.
న్యూయార్క్‌లో ఉంటున్న సిక్ ఫర్ జస్టిస్ అనే సిక్కుల హక్కుల సంస్థ గత నెలలో ఆన్‌లైన్ పిటిషన్‌ను ’వియ్ ది పీపుల్’ పేరిట వైట్‌హౌస్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పిటిషన్‌లోని వేలాది సంతకాలను తొలగించడంతో 24గంటల్లోనే సంతకాలు భారీగా తగ్గాయి.