నరేంద్ర మోడీకి అమెరికా ఎర్రతివాచీ!
వాషింగ్టన్: ఈనెల్లో అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశం ఎర్ర తివాచీ పరిచేందుకు సిద్ధమైంది. గతంలో మోడీపై ఆంక్షలు పెట్టి వీసాను రద్దు చేసిన అమెరికా.. ఆయన ప్రధాని అయ్యాక ఆంక్షలను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రధాని పదవి చేపట్టిన అనంతరం నరేంద్ర మోడీ తొలిసారి అమెరికా పర్యటనకు సిద్ధమైయ్యారు. ఈ తరుణంలో అమెరికా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు కసరత్తులు చేస్తోంది. ఈనెల 29, 30 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో శ్వేతసౌధంలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన అనేక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు.
మోడీతో అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండురోజులపాటు సమావేశం కావాలని నిర్ణయించినా..29వ తేదీన మాత్రమే ఒబామాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ముందుగా వైట్ హౌస్ లో ఒబామాతో కలిసి మోడీ డిన్నర్ లో పాల్గొనున్నారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ తో సమావేశం అవుతారని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.