రెండాకులు దక్కేనా?
నేడు తుది విచారణ ఎదురుచూపుల్లో ఓపీఎస్
కలవరంలో చిన్నమ్మ సేన
చెన్నై: రెండాకుల చిహ్నం ఎవరికి దక్కేనో అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే శిబిరాల్లో బయలు దేరింది. బుధవారం కేంద్ర ఎన్నికల యంత్రాంగం(సీఈసీ) తుది విచారణ సాగించనుండంతో పన్నీరు శిబిరంలో ఎదురుచూపులు పెరిగాయి. ఇక, చిన్నమ్మ శశికళ శిబిరంలో కలవరం బయలు దేరింది. అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో వచ్చిన చీలికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరం చేతికి చిక్కడంతో, పార్టీని, చిహ్నాన్ని కైవసం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరుసెల్వం తీవ్రంగానే వ్యూహ రచనలు, కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు.
ఎన్నికల యంత్రాంగానికి ఆయన శిబిరం చేసిన ఫిర్యాదు విచారణ సాగుతూ వస్తోంది. పన్నీరుసెల్వం శిబిరం తమ వద్ద ఉన్న ఆధారాలు, రికార్డులను ఎన్నికల యంత్రాంగానికి సమర్పించాయి. పన్నీరు శిబిరాన్ని ఎదుర్కొనే విధంగా చిన్నమ్మ శిబిరం సైతం సీఈసీకి వివరణలు ఇచ్చి ఉన్నది. తమ చేతిలో ఉన్న ఆధారాలను సమర్పించారు. తాజాగా, ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగనుండడంతో అన్నాడీఎంకే చిహ్నం రెండాకుల కైవసం మీద తీవ్ర పోటీనే సాగుతోంది. ఈ సమయంలో బుధవారం ఎన్నికల యంత్రాంగం తుది విచారణ సాగించనుంది. ఇందులో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతుందో, ఆ చిహ్నం ఎవరి చేతికి చిక్కుతుందో, అన్నాడీ ఎంకేలో నెలకొనబోయే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ తాజాగా బయలుదేరింది.
రెండాకులు దక్కేనా: గురువారంతో ఆర్కేనగర్ నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ దృష్ట్యా, బుధవారం ఆ చిహ్నం ఎవరికీ అన్నది సీఈసీ తేల్చాల్సి ఉంది. ఒక వేళ జాప్యం నెలకొన్న పక్షంలో ఆ చిహ్నంను సీజ్ చేయడం ఖాయం. దీంతో ఉప ఎన్నికల రేసులో ఉన్న రెండు శిబిరాల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థుల చిహ్నాలను ఎంపిక చేసుకోవాల్సిందే. అయితే, విచారణను త్వరిత గతిన ముగియన్ను దృష్ట్యా, ఆధారాలు, రికార్డులు, వాస్తవాలు, విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ఆ రెండు శిబిరాల్లో ఏదో ఒక శిబిరంకు ఆ చిహ్నం కేటాయించిన పక్షంలో అన్నాడిఎంకేలో ఉత్కంఠ తప్పదేమో.
అయితే, ఆ చిహ్నం తమకు దక్కుతుందన్న ధీమాతో పన్నీరు శిబిరం ఎదురు చూపుల్లో ఉండటం గమనార్హం. అలాగే, చిన్నమ్మ శిబిరంలో కలవరం వీడటం లేదు. పైపైకి తమకు దక్కుతుందని భావిస్తున్నా, సీఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన తప్పడం లేదు. ఇక, ఈ చిహ్నం కోసం ఎదురు చూపుల కారణంగా రెండు శిబిరాల అభ్యర్థులు నామినేషన్‌లు కూడా దాఖలు చేయకుండా కాలం నెట్టుకు వస్తున్నారు.