వెనక్కు తగ్గని పన్నీరు.. వెనుక ఎవరున్నారు?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముందు ఉంచిన డిమాండ్ల విషయంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం వెనక్కు తగ్గడం లేదు. అన్నా డీఎంకే రెండు గ్రూపులు విలీనం కావాలంటే పార్టీ నుంచి శశికళను, దినకరన్‌ను బహిష్కరించాల్సిందేనని, జయలలిత మృతిపై విచారణ చేయించాలని పన్నీరు వర్గం మరోసారి స్పష్టం చేసింది. అప్పటి వరకు చర్చల ప్రసక్తేలేదని చెప్పింది. దీంతో అన్నాడీఎంకే రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. మరోవైపు శశికళకు అనుకూలమైన సీఎం పళనిస్వామి వర్గం భిన్నస్వరాలు వినిపిస్తోంది.
సోమవారం పన్నీరు సెల్వం వర్గంలో ఉన్న ఎంపీ మైత్రేయన్ మీడియాతో మాట్లాడుతూ.. శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించి మన్నార్‌గుడి మాఫియా నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. జయలలిత మరణం తదనంతర పరిణామాల్లో అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. శశికళ సారథ్యంలో ఏఐఏడీఎంకే (అమ్మ), పన్నీరు సెల్వం వర్గం ఏఐఏడీఎంకే పురచ్చి తలైవి అమ్మ పేర్లతో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. రెండు వర్గాలు విలీనం కావాలంటే పైరెండు డిమాండ్లతో పాటు ముఖ్యమంత్రి పదవిని పన్నీరుకు ఇవ్వాలనే మరో డిమాండ్ కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీ పదవి, మంత్రుల పదవులపైనా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
సీఎం పళనిస్వామి వర్గంలో 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా, పన్నీరు సెల్వం వైపు కేవలం 12 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇటీవల జరిగిన విశ్వాస పరీక్షలో పన్నీరు వర్గం వ్యతిరేకించినా పళనిస్వామి నెగ్గారు. తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పన్నీరు వర్గం విలీనం చర్చల పేరుతో పళనిస్వామికి డిమాండ్లు పెడుతూ చుక్కలు చూపిస్తోంది. పన్నీరు డిమాండ్లను అంగీకరించేందుకు పళని వర్గం విముఖత చూపుతోంది. అమ్మ మరణంపై తమకు ఎలాంటి సందేహం లేదని, అలాంటపుడు విచారణ ఎందుకని వాదిస్తోంది. అంతేగాక సీఎంగా పన్నీరు ఉన్నప్పుడు విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నిస్తోంది.
ఈ నేపథ్యంలో పన్నీరు వర్గీయులు సీఎం పళనిస్వామికి హెచ్చరికలు చేసేలా మాట్లాడుతుండటంతో వారి వెనుక ఎవరున్నారన్నది తమిళ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది. తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీనే పన్నీరుకు మద్దతు ఇస్తూ నడిపిస్తోందని దినకరన్ చెప్పినట్టుగా పళని వర్గీయులు చెబుతున్నారు. పళని స్వామి వెంట ఉంటే దినకరన్ విషయంలో మాదిరిగా తమను అవినీతి కేసుల్లో ఇరికిస్తారని కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లగా, ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మూడు రోజులుగా ఆయన్ను విచారిస్తున్నారు. కాగా అన్నా డీఎంకే రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని బీజేపీ చెబుతోంది.