
అమెరికన్ డ్రోన్లను అడ్డుకునేందుకు అల్ ఖైదా వ్యూహం
అల్ ఖైదా ఉగ్రవాదులను అంతమొందించేందుకు అమెరికా మానవ రహిత యుద్ధ విమానాలతో (డ్రోన్లు) క్షిపణి దాడులు చేస్తుంటే, వాటిని అడ్డుకోడానికి అల్ ఖైదా సరికొత్త వ్యూహాలు రచిస్తోంది.
అల్ ఖైదా ఉగ్రవాదులను అంతమొందించేందుకు అమెరికా మానవ రహిత యుద్ధ విమానాలతో (డ్రోన్లు) క్షిపణి దాడులు చేస్తుంటే, వాటిని అడ్డుకోడానికి అల్ ఖైదా సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా ఆ మానవరహిత యుద్ధ విమానాలను కూల్చేయడం, లేదా జామ్ చేయడం, లేదా రిమోట్ సాయంతో హైజాక్ చేయడానికి తగిన దారులు వెతకడానికి పాకిస్థాన్లోని ఇంజనీర్లను ఆదేశించింది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో తెలిపింది.
తమ శ్రేణులను దారుణంగా దెబ్బతీస్తున్న డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయేమో తెలుసుకుని, వాటిద్వారా డ్రోన్ల దాడులను అధిగమించేందుదుకు అల్ ఖైదా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ విషయం అమెరికా నిఘా విభాగానికి చెందిన టాప్ సీక్రెట్ డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు డ్రోన్లను అల్ ఖైదా ఉగ్రవాదులు కూల్చినట్లు ఆధారాలేమీ లేకపోయినా.. అమెరికన్ నిఘా వర్గాలు మాత్రం వాళ్ల ప్రయత్నాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. వాస్తవానికి అల్ ఖైదా ఉగ్రవాదులైతే 2010 సంవత్సరం నుంచే డ్రోన్లను ఎదుర్కోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా ఈ డ్రోన్లతో చేస్తున్న క్షిపణి దాడుల వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. దీంతో పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, యెమెన్, సోమాలియా తదితర ప్రాంతాల్లో ఉగ్రవాదులు తమ కదలికలను పరిమితం చేసుకున్నారు.