అధికార కూటమిలో అప్పుడే బీటలు!
బిహార్‌లో బీజేపీని ఓడించడానికి బద్ధశత్రువులైన జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్.. మూడు పార్టీలు కలిశాయి. అనుకున్నట్లే బ్రహ్మాండమైన మెజారిటీ సాధించి అధికారాన్ని చేపట్టాయి. నితీష్‌కుమార్‌ను ముఖ్యమంత్రిగాను, ఆర్జేడీ అధినేత లాలు కుమారుల్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగాను చేశారు. అంతవరకు అంతా బాగానే కనిపించింది గానీ, ఒక్క ఏడాది గడిచిందో లేదో.. అప్పుడే అధికార కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. సర్కారు గోడలకు బీటలు వారుతున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు గానీ.. ఇదే ఒరవడి కొనసాగితే ప్రభుత్వం ఎన్నాళ్లు నిలబడుతుందో అనేది అనుమానంగానే ఉంది. అధికార పార్టీ జేడీ(యూ) సభ్యుడు, మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ అజయ్ అలోక్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి మందగమనానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని ట్విట్టర్‌లో మండిపడ్డారు. రాష్ట్రంలోని 182 ప్రాజెక్టుల మీద ఇప్పటివరకు ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టలేదని, దానివల్ల రూ. 11 వేల కోట్ల నిధులు వృథా అయ్యాయని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన మంత్రులే ఈ రెండు శాఖలను చూస్తున్నందున.. ఆ పార్టీలే ఇందుకు బాధ్యత వహించాలన్నట్లుగా అలోక్ వ్యాఖ్యానించారు. తప్పు చేసింది ఆ రెండు పార్టీలయితే అభివృద్ధి జరగకపోవడానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను తప్పుబడుతున్నారని అన్నారు. కాగ్ నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారని ఆయన చెప్పారు. పన్ను వసూళ్లలో బిహార్ 22 శాతం వృద్ధి నమోదు చేసిందని, ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. ఇలాంటి విజయాలతో పాటు వైఫల్యాలకు కూడా ఆయన్నే బాధ్యులను చేస్తున్నారని, దీనిపై తాను ఆందోళన వ్యక్తం చేశానని అన్నారు.
182 project ? Not a single penny spent!! 11000 cr lapsed ,do u know most dept from Cong and Rjd but responsibility is ours @NitishKumar
— Dr Ajay Alok (@alok_ajay) 28 March 2017