చికాగో : రాజకీయ నాయకులు, సినీతారలు, బిజినెస్ ప్రముఖులు, ఎన్నారైలు.. ఎందరో మహానుభావులు.. అందరూ ఒక్కచోటికి చేరిన వేళ ఆటా వేడుకలు అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమయ్యాయి. ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రానర్ చేతుల మీదుగా వేడుకలను ప్రారంభించారు.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ పీఎం కడియం శ్రీహారి, తెలంగాణ మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజా, శ్రీకాంత్ రెడ్డి, పార్టీ నేతలు అంబటి, భూమన కరుణాకర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
ఫస్ట్ డే బాంకెట్
ఆటా వేడుకల సంప్రదాయం ప్రకారం తొలి రోజు బాంకెట్ డిన్నర్‌తో ఆటా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆటాకు ఆర్థికంగా చేయూత నిచ్చిన దాదాపు వెయ్యి మంది ఎన్నారైలు, వారి కుటుంబాలు డిన్నర్‌కు విచ్చేశారు. విదేశీ గడ్డపై తెలుగు దనాన్ని మురిపిస్తూ.. చీర కట్టులో మహిళలు కనిపించారు. టింగ్లీష్ (ఇంగ్లీష్+తెలుగు)లో పలకరించుకుంటూ అతిథులు సందడి చేశారు. ఎప్పుడో దశాబ్దాల కింద వచ్చిన ఎన్నారైలు.. ఈ తరం యువతకు తమ సంస్కృతి, సాంప్రదాయాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
పల్లెదనం ఉట్టిపడేలా ప్రతిబింబాలు
ఆటా వేడుకల కోసం రోజ్ మెంట్ ఈ స్టీఫెన్ సెంటర్‌లో ప్రత్యేకంగా పల్లెదనాన్ని కనిపించేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. అచ్చం హైదరాబాద్‌లోని శిల్పారామంలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సెట్టింగ్‌లు పెట్టారు.
ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రానర్
భారతీయ సంస్కృతిని చూస్తే గర్వంగా ఉంది. ఉమ్మడి కుటుంబాల సంప్రదాయం వచ్చే తరానికి అందిస్తున్నారు. ఈ పద్ధతి అమెరికన్లయినా మేం కూడా నేర్చుకోవాలి.
వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి
భారత దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని విదేశీయులు కూడా ఇష్టపడుతున్నారంటే.. దానికి మనవాళ్లు ఇక్కడ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. మోడీ పాలనలో దేశం త్రీడీలో దూసుకుపోతోంది. స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన పాలన దేశంలో ఉంది. ఎన్నారైలకు పూర్తి మద్ధతుగా కేంద్రం నిలుస్తుంది.
వైవి సుబ్బారెడ్డి, వైఎస్పార్ కాంగ్రెస్ ఎంపీ
అమెరికాలో భారతీయులు సాధిస్తున్న విజయాలు చూస్తే గర్వంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకోవాలని ఎన్నారైలను కోరుతున్నాం. మీ వంతు కృషి సొంతగడ్డకు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అంబటి రాంబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి
అమెరికాలో జరుగుతున్న ఈ వేడుకకు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇంత భారీ స్థాయిలో మా క్యాడర్ రావడం సంతోషంగా ఉంది. వైఎస్సార్ పాలనను ఇప్పటికీ ఇక్కడి వాళ్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నట్టుగా పాలన జరగట్లేదు. ఇక్కడి ఎన్నారైలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాం.
రోజా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరుగుతున్న ఆటా వేడుకలకు రావడం సంతోషంగా ఉంది. ఇక్కడ వాతావరణం ఓ పెద్ద తెలుగు పండుగను తలపిస్తోంది. ఈ వేడుకల్లో భాగస్వామ్యం కావడం, ఇక్కడి వాళ్ల ఆసక్తి ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న లక్షకు పైగా ఎన్నారైలు దేశంలోని తమ వారిని ప్రభావితం చేసేవారు. వారందరూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఘనంగా ఆదరించడం నిజంగా సంతోషం.
సూపర్ సీజన్
వాతావరణం దృష్ట్యా ప్రస్తుతం అమెరికాలో చక్కటి సీజన్ కావడంతో ఆటా వేడుకలకు జనం పోటెత్తారు. రోజ్‌మంట్ లోని డొనాల్డ్ ఈ స్టీఫెన్ సెంటర్‌లో జరుగుతున్న ఆటా వేడుకలకు దాదాపు 5 వేల మంది వచ్చారు. భారీగా జనం రావడంతో ఇల్లినాయిస్ సెక్యూరిటీ ప్రత్యేకంగా ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు.
తెలుగింటి రుచులు
ఓ పెద్ద వివాహా మహోత్సవం హైదరాబాద్‌లో జరుగుతుంటే ఎలాంటి రుచులు ఉంటాయో.. సరిగ్గా అలాంటి వంటకాలే ఆటా వేడుకల్లో కనిపించాయి. నాటుకోడి కూర, మటన్ ఫ్రై, చేపల పులుసు, ఉలువ చారు, స్వీట్లు, హాట్లు, జ్యూసులు.. ఇలా రకరకాల వంటలు చవులూరించాయి. అమెరికాలో పిజ్జాలు తిని రుచులు పోగోట్టుకున్న నాలుకలకు తెలుగు వంటకాలతో పసందు చేశారు ఆటా నిర్వహాకులు.
డాన్సులు, మ్యూజిక్‌ల హోరు
తెలుగు వాళ్లు నలుగురు కలిస్తే ఎక్కడైనా అదే సందడి అన్నట్టు. ఆటా వేదికపై ఆటా, పాట, సయ్యాటలు హోరెత్తాయి. ముందు తెలంగాణ సాంస్కృతిక కళా మండలి బృందం రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో అతిథులను అలరించారు. ప్రముఖ సింగర్స్ శ్రీలేఖ తదితరులు తెలుగు సినిమా పాటలతో అతిథులను స్టెప్పులు వేయించారు. ఎన్నారైల పిల్లలు తాము నేర్చుకున్న కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. శృతిలయలు సినిమాలో చిన్నారిగా అభినయం చేసి ఆకట్టుకున్న షణ్ముఖ శ్రీనివాస్.. తనదైన శైలిలో కూచిపూడి నృత్యంతో అలరించారు.
అమెరికాలో అట్టహాసంగా ఆటా వేడుకలు
Published Sat, Jul 2 2016 7:32 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement
Advertisement