
దేశాభివృద్ధిలో ఎన్నారైలు కీలకం : వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు అర్బన్ : వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రామాలను అమెరికాలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు దత్తత తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో శుక్రవారం ఆటా వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆటా సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్‌కి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఇరవయ్యేళ్లుగా నిర్విఘ్నంగా ఆటా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలు ఐకమత్యంతో ఉండాలని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల అభివద్ధికి ఎన్‌ఆర్‌ఐల సహకారం ఎంతైనా అవసరమని ఒంగోలు ఎంపీ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలకు ఎన్‌ఆర్‌ఐల సహకారం తప్పని సరిగా అవసరమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు వైద్య, విద్యా రంగాల్లో ఎన్‌ఆర్‌ఐల సేవలు అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అమెరికాలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.