చైనీయులను ఇబ్బందిపెడుతున్న పాండాలు
చైనీయులను ఇబ్బందిపెడుతున్న పాండాలు
Published Fri, Nov 18 2016 8:54 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
అమెరికాలో పుట్టిపెరిగిన రెండు చైనా పాండాలు అక్కడి భాష, ఆహారపు అలవాట్లతో చైనీయులను ఇబ్బందిపెడుతున్నాయి. ఈ మేరకు చైనా మీడియా ఓ రిపోర్టును ప్రచురించింది. చైనాకు చెందిన మియ్ లున్, మియ్ హువాన్ పాండాలు అమెరికాలోని అట్లాంటా జూలో పుట్టి పెరిగాయి. వీటి తల్లిదండ్రులను అమెరికాకు అప్పగిస్తూ పిల్లలు జన్మించిన తర్వాత నాలుగేళ్ల లోపు వాటిని తిరిగి చైనాకు అప్పగించాలని అమెరికా-చైనాల మధ్య గతంలో ఓ ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం దాదాపు మూడేళ్ల తర్వాత ఈ నెల 5న వాటిని అమెరికా జూ అధికారులు చైనాకు అప్పగించారు.
పుట్టుకతో అమెరికా భాష, తిండికి అలవాటు పడిన లున్, హువాన్ లు చైనా భాష అర్ధం కావడం లేదని ఓ వార్త పత్రిక కథనాన్ని ప్రచురించింది. అమెరికన్ క్రాకర్స్ ను మాత్రమే తినడానికి రెండూ పాండాలు ఆసక్తిని చూపుతున్నాయని చెంగ్డూ జెయింట్ పాండా రీసెర్చ్ బేస్ అధికారి ఒకరు తెలిపారు. వెదురు బొంగుల నుంచి ఆపిల్స్ వరకూ అన్నింటిలోనూ అమెరికన్ క్రాకర్స్ ఉండేలా చూడకపోతే రెండూ ఆహారం తీసుకోవడం లేదని, తాగే నీరులో కూడా క్రాకర్స్ లేకపోతే నీటిని కూడా తాగడం లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం క్రాకర్స్ స్ధానంలో చైనీస్ బ్రెడ్ ను, చైనీస్ భాషను పాండాలకు అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. హువాన్ బ్రెడ్ తినడానికి అలవాటుపడుతుండగా, లున్ మాత్రం అసలు బ్రెడ్ ను ముట్టుకోవడం లేదని తెలిపారు.
Advertisement
Advertisement