
అనవసర వివాదాలొద్దు
దాద్రీ, బీఫ్ వ్యాఖ్యలపై పార్టీ నేతలకు అమిత్‌షా మందలింపు
న్యూఢిల్లీ: దాద్రిలో వ్యక్తిని కొట్టి చంపటం, బీఫ్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పలువురు పార్టీ నేతలను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం తన కార్యాలయానికి పిలిపించుకుని మందలించారు. ఆయా నేతల చర్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ఖట్టర్, కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి సంజీవ్ బల్యన్, ఉన్నావో ఎంపీ సాక్షి మహరాజ్, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే సంగీత్ సోమ్‌లను అమిత్‌షా మందలించారని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఉపాధి సృష్టి, పేదరికం తగ్గింపు, అభివృద్ధి వంటి మోదీ ప్రభుత్వం చేపట్టిన సానుకూల ఎజెండాను పట్టాలు తప్పించే ప్రమాదమున్న ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని షా వారిని హెచ్చరించారని పేర్కొన్నారు.
అలాగే.. సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మకు కూడా ఫోన్ ద్వారా అసంతృప్తి తెలియజేయటం జరిగిందన్నారు. పార్టీ నాయకులు అనవసరమైన వివాదాన్ని సృష్టించే ప్రకటనలు చేయరాదన్న సందేశాన్ని పార్టీ శ్రేణులన్నిటికీ పంపించనున్నట్లు చెప్పారు. గత నెలలో బీఫ్ తిన్నాడన్న వదంతులతో దాద్రిలో ఒక ముస్లిం వ్యక్తిని కొట్టి చంపటం దేశానికి సిగ్గుచేటని.. ఆ తర్వాత వస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్‌డీఏ, బీజేపీ, మోదీకి ఇతరులకన్నా ఎక్కువ చేటు చేస్తాయని.. బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ శనివారం అభివర్ణించిన నేపథ్యంలో బీజేపీ నాయకత్వం తన పార్టీ నేతలను మందలించటం గమనార్హం. అయితే.. అమిత్‌షా మందలింపు వ్యవహారం అంతా ఒక గిమ్మిక్కని ప్రతిపక్ష కాంగ్రెస్ కొట్టివేసింది.
మరో ఇద్దరు రచయితల అవార్డులు వెనక్కి
న్యూఢిల్లీ: దాద్రీ, మత అసహనంపై రచయితల నిరసన సాగుతూనే ఉంది. హిందీ రచయిత కాశీనాథ్, ఉర్దూ రచయిత మునవ్వర్ రాణాలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.
150 దేశాల రచయితల మద్దతు
వాషింగ్టన్: అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న భారత రచయితలకు, కళాకారులకు 150 దేశాలకు చెందిన రచయితలు సంఘీభావం తెలిపారు. వారి హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ రక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచవ్యాప్తంగా సాహిత్య ప్రచారం, భావ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న పెన్ ఇంటర్నేషల్ సంస్థ చీఫ్ జాన్ రాల్‌స్టన్ సాల్ శనివారం ఈమేరకు భారత రాష్ట్రపతి, ప్రధాని, సాహిత్య అకాడమీలకు లేఖ రాశారు. కల్బుర్గి, దభోల్కర్, పన్సారేల హంతకులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. కెనడాలోని క్యూబెక్ సిటీలో భేటీ అయిన 150 దేశాల రచయితలు కల్బుర్గి హత్య, తర్వాతి పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని, ప్రతి ఒక్కరి హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరాలని తనను అడిగినట్లు వెల్లడించారు.