వయసు 82 .. రెండు స్పూన్ల నీరే ఆహారం
బికనీర్: సాధారణంగా యుక్త వయసులో ఉన్నా.. తగిన సమయానికి ఏదో ఒకటి తినకపోతే ఏమాత్రం భరించలేము. ఎందుకంటే ఏ బాధనైనా భరిస్తాం కానీ క్షుద్భాదను భరించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ, ఎనభై ఏళ్లు పైబడిన వృద్ధురాలు దాదాపు రెండు నెలలుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండానే జీవిస్తుందంటే ఆశ్యర్య పోక తప్పదేమో.. అవును జైపూర్కు సరిగ్గా 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న బికనీర్కు చెందిన బదానీ దేవీ(82) గత రెండు నెలలుగా కఠిక ఉపవాసం ఉంటుంది. రోజుకు కేవలం ఓ రెండు మూడు చెంచాల నీళ్లతో సరిపెట్టుకొని ఆరోగ్య పరమైన సమస్యలు లేకుండా జీవిస్తోంది.
చాలాకాలంగా భోజనం మానేసిన కారణంగా ప్రస్తుతం ఆమె సరిగా మాట్లాడలేక మంచానికే పరిమితమైంది. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కోడళ్లు మనవళ్లు మనవరాళ్లు సరేసరి. పోని ఆస్తిపాస్తులు లేవా అంటే గొప్పగా ఉన్నాయి. కానీ బామ్మకు ఈ వయసులో ఇలాంటి పరిస్థితి ఎందుకని అనుకుంటున్నారా. మరేంలేదు. ఈ కుటుంబం జైన మతానికి చెందిన కుటుంబం. ప్రస్తుతానికి ఆమెనే వాళ్లింట్లో పెద్దావిడ.
జైనుల పురాతన సాంప్రదాయం ప్రకారం సంతారా(కాలం చెల్లేవరకు ఉపవాసం) ఆచారాన్ని ఆమె ప్రస్తుతం పాటిస్తోంది. గత జూలై నెలల నుంచి పూర్తి ఉపవాస దీక్షలోకి వెళ్లిపోయింది. ఈ ప్రక్రియ ద్వారా పరమపదించడంతో మోక్షం పొందవచ్చని జైన మతస్తులు నమ్మకం. దీంతో ఆమె రెండు స్పూన్ల నీటిని మాత్రమే తీసుకుంటుంది. ఓ చేతి వేలును ఉపయోగించడం ద్వారా తనకు నీటి అవసరం ఉందా లేదా అనే విషయం బామ్మ తెలుపుతుంటుంది. ఇక ఆ ఇంట్లో వారంతా ఆమె చుట్టూ కూర్చుని భజన చేస్తుంటారు. అంతకుముందు ఇలాంటి దీక్షలకు కిందికోర్టు అనుమతించపోయినా సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే.