స్మార్ట్ సిటీస్ మిషన్ పథకంలో భాగంగా కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి నగరం చోటు దక్కించుకుంది. ఇదివరకు తొలివిడతలో విశాఖ నగరం, కాకినాడ నగరం ఎంపికైన సంగతి తెలిసిందే. తొలి విడతలో 20 నగరాలను, రెండో విడతలో 13 నగరాలను ఎంపిక చేసిన కేంద్రం ఇప్పుడు మూడో విడతగా మరో 27 నగరాలను ఎంపిక చేసింది. ఈ జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం ఇక్కడ విడుదల చేశారు.
తాజాగా విడుదల చేసిన 27 నగరాల్లో దర్శనీయ, పర్యాటక నగరాలు 8 ఉన్నాయి. మూడో విడతలో 63 నగరాలు పోటీ పడగా ఈ 27 నగరాలు ఎంపికయ్యాయి.ఈ నగరాల జాబితాను కేంద్రం ప్రతిభాక్రమంలో విడుదల చేసింది. అమృత్‌సర్ ఈ పోటీలో మొదటి స్థానంలో నిలిచింది. అమృత్‌సర్, కల్యాణ్ బివిలి, ఉజ్జయిని, తిరుపతి, నాగ్‌పూర్, మంగళూరు, వెల్లూరు, థానే, గ్వాలియర్, ఆగ్రా, నాసిక్, రూర్కెలా, కాన్పూర్, మధురై, తూమకూరు, కోటా, తంజావూర్, నామ్చి, జలం«దర్, శివమొగ్గ, సేలం, అజ్మీర్, వారణాసి, కోహిమా, హబ్బలి–ధర్వాడ్, ఔరంగాబాద్, వడోదర నగరాలు ఉన్నాయి. ఈ 27 నగరాలు రూ. 66,883 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించాయని వెంకయ్య నాయుడు తెలిపారు.
మొత్తం ఇప్పటివరకు ఎంపికైన 60 నగరాల్లో రూ. 1,44,742 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని వివరించారు. తాజాగా ఎంపికైన నగరాలతో స్మార్ట్ మిషన్ మొత్తం 27 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలకు విస్తరించిందని వెంకయ్య నాయుడు తెలిపారు. ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా, నగర్ అండ్ హవేలీ తదితర 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరిలో మిగిలిన 40 నగరాలను ప్రకటిస్తారు.
గతంలో రెండో విడతగా విడుదల చేసిన 13 నగరాల జాబితాలో తెలంగాణ నుంచి వరంగల్లుకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ సిటీ నగరాల ఎంపిక పోటీలకు హైదరాబాద్ నగరానికి బదులు కరీంనగర్‌ను ప్రతిపాదించగా కేంద్రం సమ్మతించింది. తదుపరి విడతలో కరీంనగర్ ఎంపికయ్యే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ పాలన రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో మూడు నగరాలకు ఈ స్మార్ట్ హోదా దక్కింది. పంజాబ్ నుంచి అమృత్ సర్, లుథియానాలను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చుతున్నట్టు వెంకయ్యనాయుడు ప్రకటించారు. 2022 వరకు 100 నగరాలను స్మార్ట్సిటీలుగా కలిగిఉండాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఇప్పటివరకు 60 నగరాలను కేంద్రం ఎన్నుకోగా, మిగతా 20 సిటీలను జనవరిలో, 13 సిటీలను మేలో, మిగతా వాటిని 2018లో ఎంపికచేస్తుందని కేంద్రం ప్రకటించింది. నేడు ప్రకటించిన ఈ 27 సిటీలకు కేంద్రప్రభుత్వం రూ.66,883 కోట్లను ఖర్చుచేయనుంది.

ఈ మూడో జాబితాలో పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి ఒక్క స్మార్ట్సిటీ లేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరింది. మొత్తం 27 సిటీల్లో 10 నగరాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉండటం విశేషం. మహారాష్ట్రలో థానే, నాసిక్, నాగ్పూర్, హౌరంగాబాద్, మధ్యప్రదేశ్ నుంచి గౌలియార్, ఉజ్జయిని, రాజస్తాన్ నుంచి కొటా, అజ్మీర్, గుజరాత్ నుంచి వొడోదరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం నుంచి నాలుగు, ఒడిశా నుంచి ఒకటి, ఏఐఏడీఎంకే పాలిత రాష్ట్రం తమిళనాడు నుంచి నాలుగు, ఇతర ఎన్డీఏ కూటమి రాష్ట్రాలు సిక్కిం, నాగాలాండ్ల నుంచి ఒక్కొక్కటి స్మార్ట్సిటీ జాబితాకు ఎంపికయ్యాయి.