
తెగిపడిన ఆ గ్రామకంఠాలు.. దళారీలకు దక్షిణలు
అమరావతిలో మరో భారీ భూ కుంభకోణం
⇒ రాజధాని గ్రామాల్లో ‘పెద్దల’ ముందుచూపు ‘పథకం’
⇒ నాడు పూలింగ్ నుంచి గ్రామ కంఠాల మినహాయింపు
⇒ ఇపుడు అవన్నీ యథేచ్ఛగా అప్పగింతలు
⇒ కొత్తగా తెరపైకి ‘విస్తరించిన గ్రామకంఠం’ నిబంధన
⇒ గ్రామానికి దూరంగా ఉన్న పట్టా భూములు కూడా పచ్చ తమ్ముళ్లపరం
సాక్షి, అమరావతి బ్యూరో
రాజధాని భూముల్లో మరో అక్రమాల బాగోతం బయటపడింది. ‘గ్రామకంఠాల’ ముసుగులో సాగుతున్న భూముల కుంభకోణం ఇది. ఊరిలో ఉమ్మడి అవసరాల కోసం కేటాయించే భూములను గ్రామకంఠాలుగా పిలుస్తారన్న సంగతి తెల్సిందే. అయితే అవి ఊరికి 50 మీటర్లలోపు మాత్రమే ఉండాలి. అవసరాన్ని బట్టి వాటిని పేదలకు ఇళ్ల కోసం కూడా కేటాయిస్తుంటారు. ఈ గ్రామ కంఠం భూములను అప్పట్లో ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించారు. ఎంతో ముందుచూపుతో ఒక పథకం ప్రకారం వారు ఇచ్చుకున్న ఆ మినహాయింపును ఇపుడు చక్కగా వాడుకుంటున్నారు. కోట్ల విలువైన గ్రామకంఠం భూములను గుట్టుచప్పుడు కాకుండా హాంఫట్ చేసేస్తున్నారు. ‘పెద్ద’ తమ్ముళ్లంతా తీరిగ్గా వీటిని ఆరగించేస్తున్నారు.
అదే సమయంలో గ్రామకంఠం మినహాయింపును ఊరికి దూరంగా ఉన్న పట్టా భూములకు కూడా వర్తింపజేసుకుంటున్నారు. ‘విస్తరించిన గ్రామకంఠాలు’ పేరుతో పూలింగ్ నుంచి మినహాయింపు పొందుతున్నారు. ఒకవేళ పూలింగ్‌కు ఇచ్చినా వాటిని ఈ ‘విస్తరించిన గ్రామకంఠాలు’ కింద చూపించి తిరిగి తీసేసుకుంటున్నారు.. గ్రామకంఠాల ముసుగులో రాజధాని గ్రామాల్లో సాగుతున్న భారీ భూకుంభకోణం ఇది...దీని గురించి తెలియని స్థానికులు గ్రామ కంఠాలను పంచిపెట్టాలంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఒక పథకం ప్రకారం సాగుతున్న ఈ అక్రమాల బాగోతానికి సంబంధించి సాక్షి పక్కా ఆధారాలు సంపాదించింది. ఆ వివరాలు....
పూలింగ్ నుంచి గ్రామకంఠాలకు మినహాయింపు
రాజధాని అమరావతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో సుమారు 54వేల ఎకరాలను సమీకరించాలని తలపెట్టింది. అందులో ఇప్పటి వరకు 32వేల ఎకరాలను భూ సమీకరణ పేరుతో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారు. భూములు ఇవ్వటానికి ఇష్టపడని వారిని భయపెట్టారు. పచ్చని పంటలకు నిప్పుపెట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. తిరిగి రైతులపైనే అక్రమ కేసులు బనాయించి భూములు లాక్కున్నారు. అదే సమయంలో స్థానికులంతా ‘గ్రామ కంఠాల’ విషయం తేల్చాలని పట్టుబట్టారు. దాంతో పూలింగ్ నుంచి గ్రామకంఠాలను మినహాయించారు. ప్లాట్లు కేటాయించక ముందే గ్రామ కంఠాల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు హామీ ఇచ్చారు.
తమ్ముళ్లకు బహుమతిగా గ్రామ కంఠాలు
ప్లాట్ల కేటాయింపునకు ముందే గ్రామ కంఠాల సంగతి తేల్చేస్తారని, అనుభవంలో ఉన్న వారికే వాటిని కట్టబెడతారని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘పెద్దలు’ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ప్లాట్ల కేటాయింపు సమయంలో స్థానికులు గ్రామ కంఠాల సమస్యలను పరిష్కరించకుండా పంపిణీ ఏమిటని ప్రశ్నించినా పట్టించుకోలేదు. ఆ సమయంలో గ్రామ కంఠాల గురించి ప్రశ్నించిన వారిని పోలీసుల చేత బయటకు గెంటివేయించారు. రాజధానిలో 27 గ్రామాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తయినా ఒక్క గ్రామంలోనూ గ్రామ కంఠాలను స్థానికులకు కేటాయించలేదు. రాజధాని నిర్మాణం కోసం స్థానికులను భయపెట్టి, ఒప్పించి భూములు ఇప్పించేందుకు కృషి చేసిన స్థానిక టీడీపీ నాయకులకు ఈ గ్రామ కంఠాల భూములను బహుమతిగా కట్టబెడుతున్నారు. 50 సెంట్లు, ఆ పైన ఉన్న విస్తీర్ణం మొత్తం స్థానికంగా ఉన్న తమ్ముళ్ల పరం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ విస్తీర్ణం పక్కన వారి పేర్లు నమోదు చేయడంలేదు. ఎవరెవరికి? ఎంతెంత? ఎక్కడ కేటాయించాలనే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నట్లు సీఆర్‌డీఏలోని అధికారి ఒకరు వెల్లడించారు.
(ఇది సీఆర్‌డీఏ తీసిన తుళ్లూరు గ్రామం గూగుల్ మ్యాప్. ఎర్రని వృత్తాకారంలో ఉన్న భూములన్నీ పట్టా భూములే. వీటన్నింటినీ మినహాయించిన, విస్తరించిన గ్రామ కంఠాలుగా మార్చి కట్టబెట్టారు)
‘విస్తరించిన గ్రామ కంఠం’ పేరుతో...
గ్రామకంఠం భూములకు ఇచ్చిన మినహాయింపు ఎంతో ‘ముందుచూపు’తో ఇచ్చిందని ఇపుడు అర్ధమౌతున్నది. ఆ భూములను యధేచ్ఛగా తమ్ముళ్లు కైంకర్యం చేస్తున్నారు. అంతేకాదు ‘విస్తరించిన గ్రామకంఠం’ అనే నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన పట్టాభూములను ఈ విస్తరించిన గ్రామకంఠాల పేరుతో ‘పెద్దలు’ సూచించిన వారికి కేటాయిస్తున్నారు. రాజధానిలో ప్రధాన నగరమైన తుళ్లూరులో సర్వే నంబర్ 22/3లో 1.28 ఎకరాలను టీడీపీ నేత దామినేని శ్రీనివాసరావు సతీమణి కృష్ణవేణి పేరుతో విస్తరించిన గ్రామ కంఠం పేరుతో కేటాయించారు. ఇదే భూమిని గతంలో రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్‌పూలింగ్‌కి ఇచ్చారు. ఈ భూమి కోసం రాజధాని ప్రకటించిన ప్రారంభంలోనే దామినేని నానా రభస చేశారు. ఆ భూమిలో పొగాకు బేరన్లు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. రాజధాని ప్రకటించాక ఆ భూమి మొత్తాన్ని గ్రామ కంఠంగా చేయాలని అధికారులపై తిరుగుబాటు చేశారు.
ఒకానొక సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. ఆ సమయంలో సీఆర్‌డీఏ అధికారులు సగం భూమిని గ్రామ కంఠం మార్చి ఇస్తామని, మరో సగం భూమిని ల్యాండ్‌పూలింగ్‌కి తీసుకుంటామని చెప్పారు. సీఆర్‌డీఏ అధికారుల నిర్ణయం పై రాజధాని ప్రాంతంలోని మిగిలిన వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో ఆ భూమి మొత్తాన్ని ల్యాండ్‌పూలింగ్ కింద తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ వివాదం అంతటితో సద్దుమణిగింది. తాజాగా అదే భూమిని ‘పెద్దల’ ఆదేశాలతో సీఆర్‌డీఏ అధికారులు ‘విస్తరించిన గ్రామ కంఠం’ పేరుతో కట్టబెట్టేశారు. అదే సర్వే నంబర్ 22/3, 4, 6, 7లో ఉన్న 2.22 ఎకరాలను సైతం జమ్ముల నగేష్, ఉమామహేశ్వరరావు తదితరులకు కేటాయించారు. తుళ్లూరులోనే సర్వే నంబర్ 23/సీ, 24/3లో ఎకరం పైగా భూమిని జమ్ముల శంకర్రావు, దామినేని శ్రీనివాసరావుకు రాసిచ్చారు.
విలువైన భూములన్నీ తమ్ముళ్ల సొంతం
సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మందడం గ్రామంలో సర్వే నంబర్ 155లో 1.56 ఎకరాలు రెవిన్యూ అడంగల్‌లో సుబ్బారావు పేరున ఉంది. ప్రస్తుతం అదే భూమిని విస్తరించిన గ్రామం కంఠం పేరుతో విడిచిపెట్టారు. అదే విధంగా సర్వే నంబర్ 325లో 3 ఎకరాలు, సర్వేనంబర్ 271లో 1.18 ఎకరాలు, సర్వేనంబర్ 281లో 1.26 ఎకరాలు విస్తరించిన గ్రామ కంఠం పేరుతో టీడీపీ నేతలకు కేటాయించారు. వెలగపూడిలో సర్వే నంబర్ 92లో ఉన్న 1.19 ఎకరాలు, 92–బీ2లోని 1.12 ఎకరాలు, సర్వే నంబర్ 177లోని 1.10 ఎకరాలను విస్తరించిన గ్రామ కంఠం కింద రికార్డుల్లో నమోదు చేశారు. ఈ సర్వే నంబర్ల ఎదురుగా ఇంకా ఎవరి పేర్లు నమోదు చేయలేదు.
ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకటపాలెంలో సర్వే నంబర్ 133/2, 140/1, 147/2, 117/1ఏ, 1బీ, 1సీ, 118/3తో పాటు పలు సర్వే నంబర్లలోని పట్టా భూములను విస్తరించిన గ్రామ కంఠాల పేరుతో టీడీపీ నాయకులకు కేటాయించారు. ఒక్క వెంకటపాలెం గ్రామంలో ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చిన సుమారు 20 ఎకరాల పట్టా భూములు టీడీపీ ముఖ్యనేతలకు విస్తరించిన గ్రామ కంఠాల పేరుతో కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేశారు. రాజధానిలో మిగిలిన గ్రామాల్లో సైతం ఇదే తరహాలో పట్టా భూములను గ్రామ కంఠాల పేరుతో ఆక్రమించుకుంటున్నారు. ఇలా రాజధాని పరిధిలోని 29 గ్రామాల పరిధిలో ఊరికి దూరంగా ఉన్న పట్టా భూములను స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలందరికీ 30 సెంట్ల నుంచి ఎకరం, రెండు, మూడెకరాల చొప్పున పంచిపెడుతుండటం గమనార్హం.