దారుణ పరాజయానికి కారణాలివిగో!
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి కారణాలు, విశ్లేషణతో రూపొందించిన నివేదికను పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కమిటీ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఘోర ఓటమి కారణాలను గుర్తించాల్సిందిగా కోరుతూ ఆంటోనీ, ముకుల్ వాస్నిక్, ఆర్‌సీ ఖుంతియా, అవినాశ్ పాండేలతో ఒక కమిటీని సోనియాగాంధీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర్రాలవారీగా విశ్లేషణలతో కూడిన భారీ నివేదికతో పాటు, ప్రముఖ కారణాలను ప్రస్తావిస్తూ ఒక సంక్షిప్త నివేదికను కూడా వారు పార్టీ అధ్యక్షురాలికి అందించారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమిటీ, ఆ రాష్ట్రాల్లోని నేతలతో జరిపిన చర్చల వివరాలను కూడా నివేదికలో పొందుపర్చింది. మీడియా కథనాల్లో వచ్చినట్లు.. నివేదికలో రాహుల్ గాంధీ నాయకత్వంపై విమర్శలు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఓటమికి పార్టీ నాయకత్వాన్ని తప్పుబట్టడం కాకుండా.. బీజేపీ మీడియాను ప్రభావితం చేసిన విషయాన్ని, మీడియా పోషించిన పాత్రను, కాంగ్రెస్ పార్టీ ప్రచార లోపాలను, పార్టీలోని సంస్థాగత బలహీనతలను అందులో పేర్కొన్నారు. నరేంద్రమోడీ స్థాయిలో ప్రచారం నిర్వహించలేకపోవడాన్ని నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించారు.