దేశం క్లిష్ట పరిస్థితుల్లో
లౌకివాదంపై మోదీ సర్కారు దాడి చేస్తోంది: సోనియా
న్యూఢిల్లీ: అధికారంలో ఉన్నవారు లౌకికవాదాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ.. కేంద్రంలోని మోదీ సర్కారుపై పరోక్ష విమర్శలు సంధించారు. దీన్ని అడ్డుకోవడానికి భిన్న కుల, మత, జాతి ప్రజలను ఏకతాటిపైకి తేవాల్సిన అవసరముందన్నారు. జమాతే ఉలేమా హింద్ శనివారమిక్కడ ఏర్పాటు చేసిన ‘జాతీయ సమైక్యత సదస్సు’కు ఆమె ఈమేరకు రాతపూర్వక సందేశం పంపారు. ‘విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. లౌకికవాదాన్ని లక్ష్యం చేసుకోవడం ఆందోళనకరం’ అని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోడానికి జమాతే ఉలేమా హింద్ కృషి చేస్తోందని, దేశ స్వాంతంత్య్ర పోరాటంతో ఆ సంస్థ కాంగ్రెస్‌తో కలసి పనిచేసిందని సోనియా కొనియాడినట్లు సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు.
ఆరెస్సెస్‌లా ఐసిస్‌నూ వ్యతిరేకించాలి.. ఆజాద్: ప్రజలను విభజించడంలో ఆరెస్సెస్, ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఒకేలా వ్యవహరిస్తున్నాయని, అందుకే ఆ రెండింటిని వ్యతిరేకిస్తున్నామని గులాం నబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ముస్లింలలో ఎవరైనా తప్పులు చేస్తే వారు ఆరెస్సెస్ కంటే తక్కువేమీ కారు. ముస్లింలు, ఇతర వర్గాల ప్రజలు సంఘ్ పరివార్‌ను వ్యతిరేకించినట్లే ఐసిస్‌నూ వ్యతిరేకించాలి’ అని సదస్సులో అన్నారు. దీనిపై బీజేపీ, సంఘ్ మండిపడ్డాయి. ఆజాద్ క్షమాపణ చెప్పాలన్నాయి. ఆజాద్ వ్యాఖ్యలు కాంగ్రెస్ దివాలాకోరుతనానికి నిదర్శమని సంఘ్ పేర్కొనగా ఆరెస్సెస్ జాతీయవాద సంస్థ అని, ఆజాద్‌పై సోనియా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.