భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు భారతీయ సైనికులు మరణంపై రక్షణ శాఖ మంత్రి ఏ.కే.ఆంటోని ఈ రోజు పార్లమెంట్లో తాజా ప్రకటన చేసే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా గురువారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. భారతీయ సైనికుల మరణంపై విపక్షాల పార్లమెంట్లో ఆందోళన బాట పట్టాయి. ఆ సంఘటనపై పూర్తి వివరాల కోసం ఇప్పటికే భారత ఆర్మీ చీఫ్ సంఘటన స్థలాన్ని సందర్శించారని తెలిపారు. అనంతరం ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ఆంటోనికి వివరించారని రాజీవ్ శుక్లా చెప్పారు.
ఐదుగురు భారత సైనికుల మరణంపై రక్షణ మంత్రి ఆంటోని ప్రకటన చేయాలని బుధవారం విపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. అయితే పాకిస్థాన్ సైనికులతోపాటు మరో 20 మంది తీవ్రవాదులు సైనికుల దుస్తులు ధరించి భారత్ సైనికులపై కాల్పులు జరిపారని ఆంటోని పార్లమెంట్లో వివరించారు. ఆంటోని ప్రకటనతో విపక్షాలు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. రక్షణ మంత్రి ఆంటోని పాకిస్థాన్కు పరోక్షంగా మద్దతిస్తున్నట్లు మాట్లాడుతున్నారని విపక్షాలు ఆందోళనబాట పట్టాయి. దీంతో ఆ ఘటనపై రక్షణ మంత్రి ఆంటోని తాజా ప్రకటన చేయనున్నారు.