బాలికల ప్రవర్తన దేనికి సంకేతం? | ap dgp sambashivarao press meet on likhita kidnap case | Sakshi
Sakshi News home page

బాలికల ప్రవర్తన దేనికి సంకేతం?

Published Fri, Jun 9 2017 6:09 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

బాలికల ప్రవర్తన దేనికి సంకేతం? - Sakshi

బాలికల ప్రవర్తన దేనికి సంకేతం?

- ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు
- ఒక్క బాపట్లలోనే 16 మంది బాలికలు ఇళ్లనుంచి వెళ్లిపోయారు
- పిల్లల సంరక్షణ తల్లిదండ్రులకు పట్టదా?
- ‘లిఖిత కిడ్నాప్‌ కేసు’ వివరాలను వెల్లడించిన పోలీస్‌ బాస్‌
- 5 కోట్ల మందికి 50 వేల పోలీసులే.. అందులోనూ ఎన్నో లోపాలు


అమరావతి:
సోషల్‌ మీడియా దురుపయోగాలపై సమాజంలోని అన్ని వర్గాలూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఎన్‌.సాంబశివరావు అన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో, మొబైల్‌ఫోన్లలో ఏం చూస్తున్నారో నిరంతరం కనిపెట్టాలని తల్లిదండ్రులను కోరారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ‘లిఖిత కిడ్నాప్‌’ కేసును ఛేదించిన సందర్భంగా, ఆ కేసులో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లను డీజీపీ మీడియాకు వివరించారు. శుక్రవారం అమరావతిలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

లిఖిత కేసు గురించి మాట్లాడేక్రమంలో డీజీపీ సాంబశివరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 కోట్ల మందికి 50 వేల మంది పోలీసులే ఉన్నారని, పోలీసులు తలుచుకుంటే ఎలాంటి కేసునైనా ఛేదించగలరుకానీ.. వ్యవస్థలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘ఇటీవలి కాలంలో ఏపీలో కిడ్నాప్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందులోనూ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయే బాలికల సంఖ్య అధికంగా ఉంది. ఈ పరిస్థితికి కారకులు ఎవరు? పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా? యూట్యూబ్‌లు, వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లలో పిల్లలు ఎలాంటి వీడియోలు చూస్తున్నారో, అవి చూడటం వల్ల వారు ఎలా మారుతున్నారో కనిపెట్టాల్సిన అవసరం లేదా?’ అని డీజీపీ ప్రశ్నించారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో ఏనాడూ ఉచిత సలహాలు ఇవ్వలేదన్న సాంబశివరావు.. పరిస్థితులు చేయిదాటిపోతున్నందునే ఇలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఒక్క బాపట్ల డివిజన్‌లోనే 16 మంది మైనర్‌ బాలికలు ఇండ్లలో చెప్పకుండా బయటికి వెళ్లిపోయారని, వాళ్లలో 13 మందిని పోలీసులు పట్టుకోగలిగారని డీజీపీ తెలిపారు.  

లిఖిత కోసం 20 లక్షలు ఖర్చుపెట్టాం!
‘గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన లిఖిత(13) మూడు నెలల కింద ఇంటి నుంచి వెళ్లిపోయింది. నాగేశ్వర్‌రావు(45)అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్‌చేశాడని నిర్ధారించుకున్న తర్వాత మా బృందాలు రంగంలోకి దిగాయి. ఎక్కడో పాకిస్థాన్‌ సరిహద్దులోని సాంబా సెక్టార్‌లో వీళ్లు దొరికారు. కశ్మీర్‌ క్యాడర్‌కు చెందిన అధికారి మా టీంలో ఉండటం వల్ల అక్కడి పోలీసులతో మాట్లాడటం సులువైంది. లిఖితను సురక్షితంగా ఇంటికి చేర్చడం సంతోషమే అయినా, ఇన్ని నెలల దర్యాప్తు కోసం పోలీసు శాఖకు 20 లక్షలు ఖర్చయింది. డబ్బుల విషయంలో సమస్యలేదు కానీ పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పులే బాధాకరం.

నిందితుడికి 45ఏళ్లు.. ఆ అమ్మాయికి 13 ఏళ్లు! ఒక వేళ తనంతట తానుగా వెళ్లాలనని అమ్మాయి చెప్పినా, ఆమె మైనర్‌ కాబట్టి చట్టం ఒప్పుకోదు. మైనర్‌ బాలిక జీవితంతో ఆటలాడుకున్న నిందితుడికి జీవితాంతం జైలుశిక్ష పడేలా బలమైన కేసులు నమోదుచేస్తాం’ అని డీజీపీ సాంబశివరావు వివరించారు.

అసలేం జరిగింది?: గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన లిఖిత మూడు నెలల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగవిరమణపొంది ఆటో డ్రైవర్‌గా జీవిస్తోన్న నాగేశ్వర్‌రావు(45) అనే వ్యక్తి లిఖితను కిడ్నాప్‌ చేసినట్లు పోలీసు కేసు నమోదయింది. బాలిక తల్లిదండ్రులు మహిళా కమిషన్‌ను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం పోలీసులు నాగేశ్వర్‌రావు-లిఖితలను కశ్మీర్‌లో దొరకబుచ్చుకున్నారు. గురువారం మీడియా సమక్షంలో లిఖితను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement