నోట్ల దెబ్బకు ఐ ఫోన్ సేల్స్...
డీమానిటైజేషన్ ఎఫెక్ట్ ప్రముఖ మొబైల్ సంస్థ యాపిల్ కు బాగా ఉపయోగపడింది. విక్రయాలను పెంచుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్న యాపిల్ కు కాలం కలిసి వచ్చింది. రూ.500, రూ.1000 చలామణిని కేంద్రం రద్దు చేయడంతో ఐ ఫోన్లకు డిమాండ్ పుట్టింది. దీంతో భారతదేశంలో మిలియన్ ఐ ఫోన్ల్ అమ్మాలనే టార్గెట్ వైపు వేగంగా దూసుకుపోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దొడ్డిదారిన (పాత తేదీ రసీదులతో) ఐఫోన్ అమ్మకాలు ఊపందుకున్నాయి కేవలం మూడు రోజుల్లో లక్ష ఖరీదైన ఐ ఫోన్లను అమ్మినట్టు తెలుస్తోంది. ఇది నెల వారీ అమ్మకాల సగటులో నాలుగు రెట్లు అధికమని ట్రేడ్ పండితులు చెపుతున్నారు.
నవంబర్ 8 అర్ధరాత్రి వరకూ తాను అనేక దుకాణాల్లో ఐఫోన్ విక్రయాలు జోరందుకున్నట్టు ఢిల్లీలో ప్రముఖ మొబైల్ దుకాణం యజమాని చెప్పారు. రద్దయిన కరెన్సీ నోట్ల ద్వారా ఖరీదైన హ్యాండ్సెట్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. నిజానికి ప్రీమియం రేటుతో (అసలు ధర కంటే ఎక్కువకు) ఈ కొనుగోళ్ల జరిపినట్టు వెల్లడించారు.
మరోవైపు మొత్తంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో 20-30శాతంపెరుగుదల అంచనావేసినప్పటికీ..సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు పడిపోయినట్టు పరిశ్రమ వర్గాల విశ్లేషణ. డీమానిటైజేషన్ కారణంగా దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అక్టోబర్-డిసెంబర్ కాలంలో10 శాతం క్షీణించిందని హాంకాంగ్ కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు తరుణ్ పాఠక్ తెలిపారు. క్యాష్ ఆన్ డెలివరీ సేవలు నిలిపివేయడం కూడా ప్రభావితం చేసిందన్నారు. అయితే ఆపిల్ ఇండియా మాత్రం మిలియన్ ఐఫోన్ల సేల్ టార్గెట్ కు చేరువలో ఉందని పేర్కొన్నారు. కౌంటర్ పాయింట్ ప్రకారం, యాపిల్ అక్టోబర్ లో4 లక్షల స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేసింది. రూ 60,000 , రూ 92,000 కు ధర పలికే ఐఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ లకు భారతదేశ మార్కెట్లో డిమాండ్ బాగా ఉందని సంగీత మొబైల్ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బంగారం, ఇతర లగ్జరీ వస్తువులు, అధిక విలువగల స్మార్ట్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ ను ప్రతిబింబిస్తూ ఐ ఫోన్ అమ్మకాలు కూడా పైకి ఎగబాకాయి.