ఐఫోన్ 7 వచ్చేసింది...
♦ ఐఫోన్ 7 ప్రారంభ ధర 649 డాలర్లు;
♦ 7 ప్లస్ ధర 769 డాలర్లు
♦ సెప్టెంబర్ 16 నుంచి అమ్మకాలు
శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా) : ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ఐఫోన్ 7, 7ప్లస్ మోడల్స్‌ను యాపిల్ ఆవిష్కరించింది. బుధవారం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ కార్యక్రమం జరిగింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇతర ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమంలో సెకండ్ జనరేషన్ స్మార్ట్ వాచ్‌ను కూడా విడుదల చేసింది. కాగా, ఐఫోన్ 7 ప్రారంభ ధర(32 జీబీ బేస్ వెర్షన్) 649 డాలర్లు. ఇక 7ప్లస్ రేటు(32 జీబీ బేస్ వెర్షన్) 769 డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. 128, 256 జీబీ వెర్షన్లలోనూ ఇవి లభిస్తాయి.
ఐఫోన్ 7: 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్. వెనుక భాగంలో 12 మెగా పిక్సల్స్ కెమెరా, 2 ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
ఐఫోన్ 7 ప్లస్: 5.5 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్. ఇంత వరకూ ఏ ఫోన్‌లోనూ లేని విధంగా యాపిల్ ఐఫోన్ 7 ప్లస్‌కు కెమెరా పరంగా సరికొత్త హంగులు అద్దింది. వెనుక భాగంలో 12 మెగాపిక్సల్స్ రెండు కెమెరాలు ఏర్పాటు చేసింది. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 7 మెగాపిక్సల్ ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా సైతం ఉంది.
రెండింటిలోనూ కామన్ ఫీచర్స్
నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ కల్పించే ఐపీ 67 వాటర్‌ప్రూఫ్ ప్రమాణాలను మేరకు ఈ రెండు మోడల్స్‌ను రూపొందించడం విశేషం. త్రీడీ టచ్, 25 శాతం ప్రకాశవంతమైన డిస్‌ప్లే, 50 శాతం అధిక వెలుగును తీసుకునే క్వాడ్ ఎల్‌ఈడీ ట్రూటోన్ ఫ్లాష్ వంటివి ఉన్నాయి. ఇక, హెడ్‌ఫోన్స్ విషయానికొస్తే... ఊహించినట్టుగానే 3.5 హెడ్‌జాక్ లేదు. వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ఇందులోని మరో ప్లస్ పాయింట్. అయితే, 3.5 ఎంఎం హెడ్‌జాక్ కోరుకునే వారి కోసం అడాప్టర్‌ను అందిస్తుంది. ఏ 10 ఫ్యూజన్ 64 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ వీటిలో ఉంది. ఇక అల్యూమినియం బాడీకితోడు బ్లాక్, గోల్డ్, సిల్వర్, రోజ్ గోల్డ్ రంగుల్లో ఇవి లభ్యం. సెప్టెంబర్ 16 నుంచి 28 దేశాల్లో అమ్మకాలు ప్రారంభమవుతాయని యాపిల్ మార్కెటింగ్ చీఫ్ ఫిల్ షిలర్ ప్రకటించారు.
సేల్స్‌లో ‘ఐఫోన్ 6ఎస్’ టాప్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్‌గా ‘ఐఫోన్ 6ఎస్’ నిలిచింది. అలాగే గ్లోబల్ టాప్-3 సెల్లింగ్ మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో యాపిల్‌వే రెండు స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. అంటే రెండవ స్థానంలోనూ యాపిల్ ‘ఐఫోన్ 6’ ఉంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ మూడవ స్థానంలో నిలిచింది. ఈ అంశాలను మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘స్ట్రాటజీ అనలిటిక్స్’ తన నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం.. ఐఫోన్ 6ఎస్ విక్రయాలు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (క్యూ2) 1.42 కోట్ల యూనిట్లు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో దీని వాటా 4 శాతంగా ఉంది. ఇక ఐఫోన్ 6 విక్రయాలు 85 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో దీని వాటా 2.5%. ఇక 83 లక్షల యూనిట్ల విక్రయంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ మూడవ స్థానంలో నిలిచింది. దీని మార్కెట్ వాటా 2.4%.