ఇండియా గ్రేట్: ఆపిల్ సీఈవో ప్రశంసలు
న్యూయార్క్: భారత్ లో విరివిగా పెట్టుబడులు పెట్టాలని అమెరికా టెక్నాలజీ దిగ్గజ సంస్థ ‘ఆపిల్’ భావిస్తోంది. చాలా విషయాల్లో ఇండియాతో చర్చలు జరుపుతున్నామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. రిటైల్ స్టోర్లసహా పలు అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. ‘భారత్ లో ప్రధానంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. పెట్టుబడులకు భారత్ గొప్ప ప్రదేశమ’ని కుక్ పేర్కొన్నారు.
ఇండియాలో పాత పెద్ద నోట్ల రద్దును ఆయన సమర్థించారు. డీమోనిటైజేషన్ గొప్ప ముందుడుగు అని వర్ణించారు. డీమోనిటైజేషన్ తో దీర్ఘకాలంలో లాభాలు కలుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘డీమోనిటైజేషన్ లో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ గత క్వార్టర్ లో తమ సంస్థ మెరుగైన ఆదాయ ఫలితాలు సాధించింది. నోట్ల రద్దు గొప్ప ముందడుగు. దీనితో మున్ముందు మరింత మేలు జరుగుతుంద’ని అన్నారు. భారత్ లో తమ కంపెనీ పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.