శాన్‌ఫ్రాన్సిస్కో : టెక్ దిగ్గజం ఆపిల్ పాత ఐఫోన్లను కావాలనే స్లో డౌన్ చేసిందని వస్తున్న ఆరోపణలపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు. ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. ఐఫోన్ బ్యాటరీ సమర్థత విషయంలో మరింత పారదర్శకంగా ఉండేలా ఆపిల్ తదుపరి ఐఓఎస్ అప్ డేట్ ఉంటుందని పేర్కొన్నారు. బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక కోసం ఫోన్ స్లో డౌన్ చేసుకోవాలా లేదా అనేది యూజర్లే మానిటర్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఇంతకు ముందులేని విధంగా బ్యాటరీ పరిస్థితిని యూజర్లే విజిబుల్‌గా చెక్ చేసుకునే అవకాశం ఇచ్చి మరింత పాదర్శకంగా ఆపిల్ ఉండనుందని చెప్పారు. బ్యాటరీ మన్నిక కోసం స్లోడౌన్ చేసుకోవాలని సూచనలు వస్తే.. అది పూర్తిగా యూజర్ల ఇష్టంపైనే అధారపడి ఉంటుందన్నారు.
బ్యాటరీ విషయంలో తలెత్తుతున్న సమస్యల పట్ల యూజర్లను ఆపిల్ గత ఏడాది డిసెంబర్‌లో తన వెబ్‌సైట్‌లో క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. పాత ఐఫోన్ మోడల్స్ స్లోగా మారడానికి తామే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. అయితే యూజర్ల విధేయతను గుర్తించడానికి, నమ్మకాన్ని మళ్లీ చూరగొనడానికి ఐఫోన్లలో పలు మార్పులు చేపడుతున్నట్టు తెలిపింది. అంతేకాక పాత ఐఫోన్ల బ్యాటరీలను రిప్లేస్ చేయడానికి సంస్థ అంగీకరించింది. చాలా తక్కువ ధరకు ఆపిల్ కొత్త బ్యాటరీలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 79 డాలర్లు(సుమారు రూ.5000)గా ఉన్న బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ధరను 29 డాలర్లకు(రూ.1,850) తగ్గించినట్టు పేర్కొంది. త్వరలోనే ఈ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపింది. కొత్త ఐఫోన్లను కస్టమర్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ పాత ఫోన్లను స్లో డౌన్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఫోన్ లైఫ్‌ను పెంచేందుకే వాటిని స్లోడౌన్ చేసినట్లు ఆపిల్ పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఐఫోన్ డివైజ్‌లను స్లోడౌన్ చేసిందని కంపెనీపై కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎనిమిది దావాలు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో లీగల్ ఫిర్యాదు కూడా దాఖలైంది. ఫిర్యాదుదారులు మిలియన్ డాలర్లను పరిహారంగా కూడా కోరుతున్నారు. ఇజ్రాయిల్ ఇదే సమస్యపై సుమారు 120 మిలియన్ డాలర్లకు ఓ దావా దాఖలైంది.
Comments
Please login to add a commentAdd a comment