బాలికతో అరబ్ షేక్ వివాహం... అడ్డుకున్న పోలీసులు
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): పేదరికం, నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకొని బాలికను వివాహం చేసుకునేందుకు ఓ అరబ్ షేక్ చేసిన ప్రయత్నాన్ని రెయిన్‌బజార్ పోలీసులు అడ్డుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఒమన్ దేశం మస్కట్ ప్రాంతానికి చెందిన అల్ బాలుచీ బాదర్ యూసుఫ్ సేద్(37) గత నెల 16వ తేదీన టూరిస్ట్ వీసాపై హైదరాబాద్‌కు వచ్చాడు. హిమాయత్‌నగర్ హైదర్‌గూడలోని హోటల్ హన్షు గ్రాండ్‌లో 18వ తేదీన దిగాడు. అక్కడ ఉన్న సమయంలోనే అయేషా అనే పెళ్లిళ్ల బ్రోకర్‌తో చర్చలు జరిపాడు. దీంతో అయేషా రెయిన్‌బజార్ అరబ్‌గల్లీకి చెందిన బస్సుడ్రైవర్ ఖయ్యూం, సయ్యదా హైదరీ ఫాతిమాల కుమార్తె(17) విషయం తెలిపింది.
పేదరికంతో బాధ పడుతున్న వారికి రూ.5 లక్షలు ఇప్పిస్తానని, అరబ్ షేక్‌తో పెళ్లికి ఒప్పుకోవాలని ఆశపెట్టింది. తల్లిదండ్రులు అంగీకరించటంతో ఈ నెల 2వ తేదీన వివాహం చేయాలని నిశ్చయించి, ముందుగా ఖర్చుల కోసం అయేషా షేక్ నుంచి రూ.30 వేలు తీసుకుంది. దీంతో పాటు పాస్, పోర్టు వీసా వచ్చేంత వరకు రెండు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు కూతురితో కలసి ఉండేందుకు ఒక గది అద్దెకు తీసుకోవాలని బాలిక తండ్రి ఖయ్యూంకు రూ.15 వేలు అందజేసింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 10 గంటలకు వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రెయిన్‌బజార్ ఎస్సై జి.శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకొని విషయాన్ని పసిగట్టి వివాహాన్ని అడ్డుకున్నారు. వెంటనే అరబ్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. విలేకర్ల సమావేశంలో మీడియా ముందుకు అరబ్ షేక్‌ను తీసుకొచ్చిన సమయంలో అతడు నవ్వులు చిందిస్తూ కనిపించడం గమనార్హం.