
మోడీని వెంటాడుతున్నవారణాసి సంకటం!
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వారణాశి సంకటం వెంటాడుతోంది. మోడీ వారణాసి నుంచి పోటీకి సిద్ధమైతే ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా అక్కడ నుంచే పోటీకి దిగే యోచనలో ఉన్నారు. ఆప్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా గురువారం ఇచ్చిన ఇంటూర్యూలో కేజ్రీవాల్ వారణాశి నుంచి పోటీకి దిగే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాడు. వారణాసిలో మోడీ పోటీకి దిగితే పోటీకి కేజ్రీవాల్ కూడా అక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆప్ పార్టీ 350-400స్థానాల్లో పోటీకి దిగేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ వారణాశి నుంచి పోటీ చేసే అంశం ఆసక్తిని పెంచుతోంది.
ఒకవేళ మోడీ భయపడి రెండు స్థానాల్లో పోటీకి దిగితే మాత్రం ఒకటి వారణాసి లోక్ సభ స్థానం తప్పక ఉంటుందని భావిస్తన్నారు . కాగా, గుజరాత్ రాష్ట్రంలోని ఒక లోక్ సభ స్థానం మాత్రమే మోడీ పోటీకి దిగుతారని బీజేపీ తెలిపింది. రెండు స్థానాల్లో పోటీ చేయాలనకుంటే మాత్రం ఆ అంశాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డు చూసుకుంటుందని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపానీ తెలిపారు.
అంతకుముందు కూడా వారణాసి సీటు వల్ల ఆర్ఎస్ఎస్కు బీజేపీ నాయకుల వైఖరి వల్ల సంకట స్థితి ఎదురైంది. వారణాశి నుంచి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి లోక్సభకు పోటీ చేస్తారనే వార్తలు రావడంతో జోషీ అలకబూనారు. దీనికి తోడు బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల రెండు జాబితాల్లో జోషీ పేరు లేకపోవడంతో ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది. వారణాశి అభ్యర్థి ఎవరన్న విషయం బీజేపీలో విభేదాలకు దారితీసింది.